- సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలి
- ఆదాయ వనరులు పెంచే లాభదాయక ప్రాజెక్టులను గుర్తించాలి
- వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్, కలెక్టరేట్ మహా ;
వరంగల్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అభివృద్ధి, ఆర్థిక బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అభివృద్ధి కార్యకలాపాలపై విస్తృతంగా చర్చించారు. సహకార సంఘాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం, ఆదాయ వనరులను పెంపొందించడం, సంఘాలను ఆర్థికంగా స్వావలంబన దిశగా తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన వివిధ ప్రాజెక్టులపై సమీక్షించారు.
సహకార సంఘాల పరిధిలో పెద్ద ఎత్తున గోడౌన్ల నిర్మాణం చేపట్టి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు అదనపు ఆదాయ వనరులను సమకూర్చే అవకాశాలపై చర్చించారు.
అలాగే మామిడి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేయడం, అర్హత కలిగిన సహకార సంఘాల ద్వారా విత్తన శుద్ధి, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి అంశాలను పరిశీలించారు.
సేంద్రీయ ఎరువుల తయారీ, సంబంధిత కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా సహకార సంఘాలకు అదనపు ఆదాయ వనరులు కల్పించే అవకాశాలపై కూడా చర్చించారు.
సహకార సంఘాల దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం కోసం ఆదాయాన్ని సమకూర్చే, లాభదాయకమైన ప్రాజెక్టులను గుర్తించి అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధిత శాఖలు, ఆర్థిక సంస్థలతో సమన్వయం చేసుకుని తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని సహకార సంఘాల అభివృద్ధికి దోహదపడే ఉత్తమ ప్రాజెక్టులను గుర్తించి, వాటి అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో కన్వీనర్‌గా జిల్లా సహకార అధికారి ఎం. నీరజ వ్యవహరించారు. డీసీసీబీ సీఈఓ, నాబార్డ్ డీడీఎం, ఎఫ్‌సీఐ, ఎస్‌డబ్ల్యూసీ అధికారులు, పశుసంవర్ధక శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొని తమ సూచనలు అందించారు.








