Mahaa Daily Exclusive

  మీడియాకు సమాచారం ఇస్తే కఠిన చర్యలు!

Share

మీడియాకు సమాచారం ఇస్తే కఠిన చర్యలు!
• టీజీ ట్రాన్స్‌కో ఉద్యోగులకు యాజమాన్యం హెచ్చరిక.
• ముందస్తు అనుమతి లేకుండా సంస్థ విషయాలు వెల్లడించొద్దని సర్క్యులర్‌.

హైదరాబాద్‌, మహా,

తెలంగాణ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీజీ ట్రాన్స్‌కో)కు సంబంధించిన అధికారిక, అంతర్గత సమాచారాన్ని యాజమాన్యం అనుమతి లేకుండా పత్రికలు, ప్రసార మాధ్యమాలు లేదా బయటి వ్యక్తులకు చేరవేస్తే కఠిన క్రమశిక్షణా చర్యలు తప్పవని సంస్థ యాజమాన్యం హెచ్చరించింది. టీజీ ట్రాన్స్‌కో సీఎండీ ఆదేశాల మేరకు ఈ మేరకు తాజాగా సర్క్యులర్‌ జారీ చేసినట్లు సమాచారం. సంస్థకు చెందిన అంతర్గత వ్యవహారాలను కొందరు అధికారులు, ఉద్యోగులు, ఆర్టిజన్లు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా బయటకు చేరవేస్తున్నట్లు యాజమాన్యం దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది.

సంస్థ అంతర్గత సమాచారాన్ని అనధికారికంగా బయట వ్యక్తులతో పంచుకోవడం సేవా నిబంధనలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని యాజమాన్యం స్పష్టం చేసింది. ఇటువంటి సమాచార మార్పిడి వల్ల సంస్థకు సంబంధించిన అసంపూర్ణ లేదా తప్పుదోవ పట్టించే సమాచారం ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉందని, తద్వారా టీజీ ట్రాన్స్‌కో ప్రతిష్ఠకు నష్టం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొంది.

ముందస్తు అనుమతి తప్పనిసరి

సంస్థలో పనిచేసే ఏ అధికారి, ఉద్యోగి లేదా ఆర్టిజన్‌ అయినా ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా పత్రికలు, వార్తా సంస్థలు, టీవీ చానెళ్లు, డిజిటల్‌ మాధ్యమాలు, జర్నలిస్టులు, రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లతో సంస్థకు సంబంధించిన విషయాలపై మాట్లాడటం లేదా సమాచారం అందించడం చేయరాదని సర్క్యులర్‌లో ఆదేశించినట్లు తెలుస్తోంది. సంస్థ అంతర్గత వ్యవహారాలు, సున్నితమైన అధికారిక అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అనధికారికంగా వెల్లడించకుండా ఉద్యోగులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

అంతేకాకుండా సంస్థకు సంబంధించిన సున్నితమైన, గోప్యమైన అధికారిక విషయాలను క్యాంటీన్లు, కారిడార్లు, లిఫ్ట్‌లు, వేచిచూసే ప్రదేశాలు, ప్రజా రవాణా వాహనాలు, సామాజిక సమావేశాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో చర్చించవద్దని యాజమాన్యం స్పష్టం చేసినట్లు సమాచారం. సంస్థలోని సమాచార గోప్యతను కాపాడటం ప్రతి ఉద్యోగి బాధ్యత అని పేర్కొంది.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

టీజీ ట్రాన్స్‌కోలోని అన్ని విభాగాల అధిపతులు తమ పరిధిలోని అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ఈ ఆదేశాలను స్పష్టంగా తెలియజేయాలని యాజమాన్యం సూచించింది. సర్క్యులర్‌లో పేర్కొన్న నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే సంబంధిత సేవా నిబంధనల ప్రకారం కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

సంస్థకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఎవరు, ఏ సందర్భంలో బయటకు వెల్లడించవచ్చనే విషయంలో యాజమాన్యం నిర్దేశించిన అనుమతి విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో టీజీ ట్రాన్స్‌కోలో అంతర్గత సమాచార పరిరక్షణ, మీడియాతో అధికారుల సంబంధాలపై యాజమాన్యం మరింత కఠిన వైఖరి అవలంబించినట్లు స్పష్టమవుతోంది.

Latest