• సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలి.
• భారతీయ జనతా పార్టీ జాతీయ సహ ఇన్చార్జి–తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ డా. పొంగులేటి సుధాకర్‌రెడ్డి
హైదరాబాద్, మహా:
తెలంగాణలో 22-ఏ నిషేధిత ఆస్తుల జాబితాకు సంబంధించి నెలకొన్న వివాదాలు, భూ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భూ రికార్డుల్లో చోటుచేసుకున్న తప్పిదాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పూర్తి పారదర్శకతతో సమాధానం చెప్పాలని భారతీయ జనతా పార్టీ జాతీయ సహ ఇన్చార్జి–తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ డా. పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. 22-ఏ అంశంపై ప్రభుత్వం సమగ్ర శ్వేతపత్రాన్ని విడుదల చేసి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆయన కోరారు.
22-ఏ నిబంధన కేవలం చట్టపరమైన అంశంగా చూడరాదని, దాని ప్రభావం నేరుగా రైతులు, భూ యజమానులు, కుటుంబాల భవిష్యత్తుపై పడుతుందని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఒక కుటుంబం జీవితకాలం పొదుపు చేసిన భూమి పొరపాటుగా నిషేధిత జాబితాలో చేరితే రిజిస్ట్రేషన్ సమస్యతోపాటు ఆ కుటుంబ ఆర్థిక భద్రత కూడా దెబ్బతింటుందని అన్నారు.
ప్రభుత్వ భూములు, చట్టబద్ధంగా బదిలీ చేయరాని భూములు, దేవాదాయ, వక్ఫ్ తదితర రక్షిత ఆస్తులను కాపాడటం 22-ఏ నిబంధన అసలు ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో నిజమైన ప్రైవేటు భూ యజమానులకు అన్యాయం జరగకూడదని అన్నారు. ఒక పౌరుడి భూమిని 22-ఏ జాబితాలో చేర్చినట్లయితే అందుకు కారణం ఏమిటి, ఏ నిబంధన కింద చేర్చారు, ఏ ప్రభుత్వ ఉత్తర్వు లేదా రాజపత్ర ప్రకటన ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు, ఏ అధికారి ఆ నిర్ణయం తీసుకున్నారనే వివరాలు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు.
పరిపాలనా లేదా రికార్డు తప్పిదాల కారణంగా కొన్ని నిజమైన ప్రైవేటు ఆస్తులు కూడా 22-ఏ పరిధిలోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో, మొత్తం వివరాలను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సుధాకర్‌రెడ్డి అన్నారు. ఎన్ని ఆస్తులు పొరపాటుగా 22-ఏలో చేరాయి, ఎన్ని సరిచేశారు, ఎన్ని తొలగించారు, ఇంకా ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయో వెల్లడించాలని కోరారు.
ఒక సర్వే నంబరులోని చిన్న భాగానికి మాత్రమే వివాదం ఉన్నప్పటికీ మొత్తం సర్వే నంబరుపై ఆంక్షలు విధించడం వల్ల నిజమైన భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఒకటి రెండు స్థలాలకు సమస్య ఉంటే మొత్తం సర్వే నంబరులోని ప్రతి నిజమైన భూ యజమాని రిజిస్ట్రేషన్ ఎందుకు ఆపాలని ప్రశ్నించారు. పరిపాలనా లేదా సాంకేతిక తప్పిదాలకు సామాన్య ప్రజలు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.
22-ఏకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సమస్యల్లో 98 శాతం వరకు పరిష్కరించామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో, కేవలం శాతం మాత్రమే కాకుండా అసలు కేసుల సంఖ్యను కూడా ప్రజలకు వెల్లడించాలని సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. 98 శాతం అంటే మొత్తం ఎన్ని కేసుల్లో 98 శాతం, అందులో ఎన్ని పరిష్కరించారు, ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే పూర్తి లెక్కలు చెప్పాలని కోరారు.
ఒక ఆస్తి 22-ఏ నిషేధిత జాబితాలో చేరడం వల్ల రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా రుణం పొందడం, తనఖా పెట్టడం, విక్రయించడం వంటి ఆర్థిక లావాదేవీలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. పిల్లల చదువు, వైద్యం లేదా ఇతర అత్యవసర అవసరాల కోసం సొంత భూమిని చట్టబద్ధంగా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడితే దాన్ని కేవలం రెవెన్యూ శాఖ సమస్యగా చూడలేమని, అది ప్రజల జీవన సమస్యగా పరిగణించాలని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో 22-ఏ అంశంపై సమగ్ర శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయాలని సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. 2023 డిసెంబరు 7 నాటికి 22-ఏ జాబితాలో ఉన్న మొత్తం భూమి విస్తీర్ణం, ప్రస్తుతం ఉన్న భూమి, ఈ మధ్యకాలంలో కొత్తగా చేర్చిన భూమి, తొలగించిన భూమి, జిల్లాల వారీగా వివరాలు, పరిపాలనా లేదా సాంకేతిక తప్పిదాలుగా గుర్తించిన నమోదులు, అందిన ఫిర్యాదులు, పరిష్కరించినవి, తిరస్కరించినవి, పెండింగ్‌లో ఉన్నవి, న్యాయస్థానాల ఆదేశాల మేరకు సవరించిన ఆస్తుల వివరాలను శ్వేతపత్రంలో వెల్లడించాలని కోరారు.
ప్రభుత్వ భూములను కాపాడటం ఎంత ముఖ్యమో, నిజమైన పౌరుడి ఆస్తిని కాపాడటం కూడా అంతే ముఖ్యమైన ప్రభుత్వ బాధ్యత అని సుధాకర్‌రెడ్డి అన్నారు. అక్రమ ఆస్తులకు రక్షణ కల్పించాలని తాము కోరడం లేదని, ప్రభుత్వ భూములను ఎవరికైనా అప్పగించాలని అడగడం లేదని స్పష్టం చేశారు. అయితే భూ రికార్డుల్లో చోటుచేసుకున్న తప్పిదాల వల్ల నిజమైన భూ యజమానులు నష్టపోకుండా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. 22-ఏపై పూర్తి లెక్కలు బయటపెట్టి సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు.








