కొత్తగా 2 పోలీస్ స్టేషన్లు
3 శాంతిభద్రతల డివిజన్లు
ట్రాఫిక్ విభాగంలోనూ పునర్వ్యవస్థీకరణ
హైదరాబాద్, మహా : ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ అనంతరం.. ఫ్యూచర్ సిటీ పరిధిలోనూ మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందులో భాగంగా రెండు కొత్త పోలీస్ స్టేషన్లు, మూడు కొత్త శాంతిభద్రతల డివిజన్లను ఏర్పాటు చేసింది. ఆమనగల్, కొత్తూరు, మొయినాబాద్ పేర్లతో కొత్త శాంతిభద్రతల డివిజన్లు ఏర్పాటయ్యాయి. ఆదిబట్లలో కొత్త పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌ను రెండు ట్రాఫిక్ జోన్లుగా పునర్వ్యవస్థీకరించింది. ట్రాఫిక్-1, ట్రాఫిక్-2 పేర్లతో రెండు జోన్లు, మూడు ట్రాఫిక్ డివిజన్లు, ఎనిమిది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. మహేశ్వరం, షాద్‌నగర్, చేవెళ్ల పేర్లతో మూడు ట్రాఫిక్ డివిజన్లు ఏర్పాటు కాగా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌ను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌లోని మహేశ్వరం జోన్‌లోకి మార్చింది. అలాగే మొయినాబాద్, కొత్తూరు, ఆమనగల్ ప్రాంతాలను ట్రాఫిక్ విభాగాల పరిధిలోకి తీసుకొచ్చింది.
శంషాబాద్ పీఎస్ పేరు మార్పు
శంషాబాద్ పోలీస్ స్టేషన్ పేరును పెదగొల్కొండగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. పెదగొల్కొండ పోలీస్ స్టేషన్‌ను షాద్‌నగర్ జోన్‌లోని కొత్తూరు డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చింది. గతంలో శంషాబాద్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పేర్లతో రెండు పోలీస్ స్టేషన్లు ఉండగా, ప్రస్తుతం ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌కు శంషాబాద్‌గా పేరు మార్చింది. గ్రీన్‌పార్క్ పోలీస్ స్టేషన్‌ను సీసీఎస్ పోలీస్ స్టేషన్‌గా మార్చింది.
మొయినాబాద్ ట్రాఫిక్ డివిజన్‌లోకి మూడు ప్రాంతాలు
షాబాద్, మొయినాబాద్, అజీజ్‌నగర్ రాజాలను మొయినాబాద్ ట్రాఫిక్ డివిజన్ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కమిషనరేట్ పరిధి పునర్వ్యవస్థీకరణతో శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేలా పోలీస్ విభాగంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.








