Mahaa Daily Exclusive

  రైతు కూలీలకు డబ్బులివ్వడానికి కాంగ్రెస్‌కు మనసు రావడం లేదా?

Share

రైతు కూలీలకు డబ్బులివ్వడానికి కాంగ్రెస్‌కు మనసు రావడం లేదా?
* బీసీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీసిన మాజీ మంత్రి హరీశ్‌రావు.
హైదరాబాద్‌, మహా.
తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సాగునీటి సమస్యలు, రైతు కూలీల ఆర్థిక దుస్థితి, పంటల సాగుపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతు కూలీలకు ఆర్థిక సాయం అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో యాసంగిలో పంటలు వేయవద్దని చెబుతున్న ప్రభుత్వ తీరు వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు ఎలా జీవించాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. సాగునీరు అందుబాటులో ఉన్నప్పటికీ, అవసరమైన చోట వినియోగించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
రైతు కూలీలకు డబ్బులు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసు రావడం లేదని విమర్శించిన హరీశ్‌రావు.. పంటలు సాగు చేయవద్దని సూచిస్తే వ్యవసాయంపై ఆధారపడిన కూలీల జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కూలీలు తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని, బతుకుదెరువు కోసం మళ్ళీ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి తీసుకువస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వలస వెళ్లిన వారు తిరిగి స్వగ్రామాలకు వచ్చారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మళ్లీ వలసల పర్వం ప్రారంభమైందని ఆరోపించారు. వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గితే గ్రామీణ కుటుంబాలపై ఆర్థిక భారం విపరీతంగా పెరుగుతుందని అన్నారు.
సాగునీటి సమస్యల కారణంగా రైతులు సొంతంగా డీజిల్‌ ఇంజిన్లు ఏర్పాటు చేసుకుని పంటలను కాపాడుకునే దుస్థితి ఏర్పడిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ పరిస్థితులను ప్రస్తావిస్తూ ప్రతి సమస్యను ఎల్‌నినోతో ముడిపెట్టి ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. చివరకు బొగ్గు కొరత వంటి అంశాలను కూడా ఎల్‌నినోతో ముడిపెట్టడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నేడు నెలకొన్న దుర్భర పరిస్థితులకు ప్రభుత్వ అసమర్థతే కారణమని దుయ్యబట్టారు.
దేవాదుల ప్రాజెక్టులో మోటార్లు ఎందుకు నడపడం లేదని ప్రభుత్వాన్ని నిలదీసిన ఆయన.. సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుల నిర్వహణపై స్పష్టమైన కార్యాచరణ ఉండాలని డిమాండ్ చేశారు. నీటి వనరులను సమర్థంగా వినియోగించి రైతులకు అవసరమైన సమయంలో నీరు అందించాలని కోరారు. మరోవైపు సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం వినియోగానికి కేవలం రెండు టీఎంసీల నీరు మాత్రమే ఉందని పేర్కొంటూ.. ఆ నీటిని కూడా తాగునీటి కోసం కాకుండా బీర్ల తయారీ కంపెనీలకు తరలిస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు. దసరా సమయంలో మద్యం కొరత రాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వ పెద్దలు కంపెనీలకు నీరు కేటాయిస్తున్నారని విమర్శించారు.
ప్రజలకు తాగునీరు అందించాల్సిన అత్యవసర సమయంలో బీర్ల తయారీ కంపెనీలకు నీరు కేటాయించడం ఏంటని ప్రశ్నించిన హరీశ్‌రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఎవరికి ప్రాధాన్యం ఇస్తోందని నిలదీశారు. గతంలో పంటల కోసం జూరాల ప్రాజెక్టు గేట్లు తెరిచిన రైతులను జైలుకు పంపించిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు తాగునీటి అవసరాలను గాలికొదిలి కంపెనీలకు నీరు ఇస్తోందని మండిపడ్డారు. నీరు అందుబాటులో ఉన్నప్పటికీ సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులు అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రికి కనీసం గంటసేపు సమయం లేదా అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రైతుల గోడును పట్టించుకోకుండా బీర్ల కంపెనీలకు నీటి కేటాయింపులు, ఢిల్లీలో రాజకీయ వ్యవహారాలకే ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సాగునీటి సరఫరాపై స్పష్టమైన ప్రకటన చేయాలని, రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.

Latest