Mahaa Daily Exclusive

  ఫారం-6 సవరణలకు మేమెక్కడా ఆమోదం తెలపలేదు…. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.

Share

న్యూఢిల్లీ, మహా.

ఓటర్ల నమోదు ప్రక్రియలో ఉపయోగించే ఫారం-6 సవరణలపై చెలరేగిన వివాదంపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. కొత్త ఫారం-6లో చేసిన మార్పులకు తాము ఎక్కడా ఆమోదం తెలపలేదని ప్రధానన్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చిచెప్పింది. సవరించిన ఫారాలకు సుప్రీంకోర్టు ఆమోదం ఉందంటూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పేర్కొన్న వాదనలపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫారం-6లో ఈ మార్పులు ఎవరు చేశారు, ఏ విధానంలో ఈ సవరణలు జరిగాయనే అంశాలను సంబంధిత రికార్డులను పరిశీలించిన తర్వాతే నిర్ధారిస్తామని స్పష్టం చేసింది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సందర్భంగా ఫారం-6లో కొన్ని అదనపు డిక్లరేషన్లు, మార్పులు చేయడంపై పక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. తాము ఎలాంటి సవరించిన ఫారం-6ను ఆమోదించలేదని స్పష్టం చేసింది. రికార్డులు పరిశీలించిన తర్వాత ఈ మార్పులు ఎవరి ఆదేశాల మేరకు జరిగాయో పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది.
మరోవైపు, ఓటర్ల నమోదు కోసం దరఖాస్తు చేసే పౌరులు ఉపయోగించే ఫారం-6లో చట్టబద్ధమైన నిబంధనలను పాటించకుండా మార్పులు చేశారని పిటిషనర్లు ఆరోపించారు. ఈ అంశంపై తదుపరి విచారణలో అధికారిక రికార్డుల పరిశీలన అనంతరం మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. ఓటర్ల నమోదు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాలని, చట్ట నిబంధనలకు లోబడే మార్పులు జరగాలని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Latest