Mahaa Daily Exclusive

  విజయవాడ పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…

Share

  • విజయవాడ పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
  •  14, 15 తేదీల్లో పలు కార్యక్రమాల్లో భాగస్వామ్యం.

విజయవాడ, మహా.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14, 15 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిని సందర్శించి శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. అలాగే పున్నమి ఘాట్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సరస్‌ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొని, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, లఖ్‌పతి దీదీలతో ప్రత్యేకంగా ముచ్చటించనున్నారు. రాష్ట్రపతి రాకను పురస్కరించుకుని అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. భద్రత, రవాణా, ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు ప్రోటోకాల్‌ నిబంధనల అమలుపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
షెడ్యూల్ ప్రకారం.. అక్టోబరు 14న సాయంత్రం 6.25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న రాష్ట్రపతి, అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. రాత్రి 7.20 గంటలకు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి రాకపోకల సమయంలో ఎలాంటి ట్రాఫిక్‌ అంతరాయాలు కలగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇక పర్యటనలో రెండో రోజైన అక్టోబరు 15న పున్నమి ఘాట్‌లో నిర్వహించే సరస్‌ మేళాలో ఆమె పాల్గొంటారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి, మహిళా సాధికారతకు అద్దం పట్టే ఈ వేదికపై లఖ్‌పతి దీదీలతో విందు కార్యక్రమంలో ముచ్చటించనున్నారు. పొదుపు సంఘాల ద్వారా మహిళలు సాధిస్తున్న ఆర్థిక స్వావలంబనను ఈ వేదిక ద్వారా ప్రోత్సహించనున్నారు.
ఈ పర్యటన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్‌ వివిధ శాఖల అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, రాష్ట్రపతి ప్రోటోకాల్‌ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. విమానాశ్రయం నుంచి ఇంద్రకీలాద్రి వరకు, పున్నమి ఘాట్ ప్రాంతంలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, అత్యవసర సేవలన్నీ అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబరు 15న మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. ఆధ్యాత్మికత, మహిళా సాధికారత ఉట్టిపడే ఈ రాష్ట్రపతి పర్యటనకు సర్వం సిద్ధం చేస్తున్నారు.

Latest