రైతులపై ప్రేమ ఉంటే ఫసల్ బీమా అమలు చేయాలి.
* కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర విమర్శలు.
హైదరాబాద్, మహా.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సాగు సమస్యలు, పంటల బీమా అమలు తీరు, ఆరు గ్యారంటీల వైఫల్యాలు మరియు ఓట్ల తొలగింపు ఆరోపణలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. 2014కు ముందు దేశంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దళారీ వ్యవస్థను పూర్తిగా అరికట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు భారీగా నిధులు కేటాయించిందని, రాష్ట్రంలో ఏకంగా 41 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద ఆధునికీకరిస్తున్నామని గుర్తుచేశారు.
రాష్ట్రంలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రత్యేక విమానంలో ఢిల్లీ పర్యటనలు చేయడం సరికాదని రాంచందర్ రావు ఎద్దేవా చేశారు. రైతులకు నిజంగా సంక్షేమం అందించాలనే చిత్తశుద్ధి ఉంటే ముందుగా పంటల నష్టపరిహారం, సాగు నీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలోనూ వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులను కూడగట్టి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇస్తామన్న ‘ఆరు గ్యారంటీలు’ పూర్తిగా అమలు చేసే వరకు రాహుల్ గాంధీ పర్యటనలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
ఓట్ల తొలగింపు అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు రాంచందర్ రావు ప్రకటించారు. నిజంగా ఓట్లు తొలగించబడితే బాధితుల్లో పది మందిని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి తీసుకువచ్చి నిరూపించాలని సవాల్ విసిరారు. మరోవైపు, గోవా కంటే తెలంగాణలోనే మాదకద్రవ్యాల (డ్రగ్స్) అక్రమ రవాణా, వినియోగం ఎక్కువగా ఉందని, యువతను కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూడడం ఖాయమని, దేశంలో కాంగ్రెస్ ముక్త భారత్ దిశగా ప్రజలు తీర్పునిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.








