Mahaa Daily Exclusive

  పట్నంలో అంబరాన్నంటిన బతుకమ్మ మహాసంబురాలు…

Share

  • పట్నంలో అంబరాన్నంటిన బతుకమ్మ మహాసంబురాలు…
  • పూల పండుగకు పులకించిన అంబేద్కర్ చౌరస్తా…
  • ఆటపాటలతో మార్మోగిన ప్రాంగణం…
  • మల్‌రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
  • మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మల్‌రెడ్డి స్నేహ-అభిషేక్…
  • విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే రంగారెడ్డి..

ఇబ్రహీంపట్నం అక్టోబర్ 15 మహా:
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వైభవం బుధవారం రాత్రి ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో అంబరాన్నంటింది. మల్‌రెడ్డి యువశక్తి నేతృత్వంలో నిర్వహించిన బతుకమ్మ మహాసంబురాలు కన్నులపండువగా సాగాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, మహిళల ఉత్సాహభరితమైన ఆటపాటలు, కోలాటాలతో అంబేద్కర్ చౌరస్తా పూలవనాన్ని తలపించింది. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయతకు, ప్రకృతితో ముడిపడిన మన సంస్కృతికి అద్దం పట్టేలా ఈ వేడుకలు సాగాయి. ఈ మహాసంబురాలకు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మల్‌రెడ్డి యువశక్తి కన్వీనర్ మల్‌రెడ్డి స్నేహ-అభిషేక్‌రెడ్డి, కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు పారిజాతానర్సింహారెడ్డి హాజరై, వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇబ్రహీంపట్నంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి, తమ సృజనాత్మకతను ప్రతిబింబించేలా అందమైన బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు. తంగేడు, గునుగు తదితర రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు ప్రాంగణమంతా పండుగ శోభను నింపాయి.

ఉయ్యాల పాటలు.. కోలాటాలతో హోరెత్తిన వేడుకలు…
సింగర్ భవానీ, నల్గొండ గద్దర్ నర్సిరెడ్డి నేతృత్వంలో సాగిన ఉయ్యాల పాటలు మహిళల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. తరతరాలుగా తెలంగాణ పల్లెల్లో ప్రతిధ్వనిస్తున్న బతుకమ్మ పాటలు మరోసారి ఆడబిడ్డల గొంతుల్లో సజీవమయ్యాయి. పాటల తాళానికి అనుగుణంగా మహిళలు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. సంప్రదాయ కోలాటాలు, జానపద గీతాలతో ప్రాంగణమంతా పండుగ సందడితో మార్మోగింది.
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మల్‌రెడ్డి స్నేహ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు మహిళలతో మమేకమై పండుగ సంబరాలను పంచుకోవడంతో అక్కడి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారింది. మహిళల ఆనందోత్సాహాలు, బతుకమ్మ పాటల సందడి, పూల సోయగాలు కలిసి ఇబ్రహీంపట్నంలో పండుగ వైభవాన్ని చాటిచెప్పాయి.

విజేతలకు నగదు బహుమతులు.. పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహకాలు…
బతుకమ్మ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు నిర్వాహకులు నగదు బహుమతులు అందజేశారు. సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మలను అందంగా పేర్చి తీసుకువచ్చిన మహిళలను ప్రోత్సహిస్తూ విజేతలను ప్రకటించారు. మొదటి బహుమతి – రూ.25,000: మంచాల మండలానికి చెందిన జయమ్మ, యాచారం మండలం తాడిపర్తికి చెందిన మంజుల గెలుచుకున్నారు. రెండో బహుమతి – రూ.15,000: ఇబ్రహీంపట్నంకు చెందిన హంసమ్మకు లభించింది. మూడో బహుమతి – రూ.10,000, ఇబ్రహీంపట్నంకు చెందిన లావణ్య గెలుచుకున్నారు.
పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహం కింద బహుమతులు అందజేసి వారిని అభినందించారు. బతుకమ్మ పండుగను కేవలం పోటీగా కాకుండా, మహిళల ఐక్యతకు, సంప్రదాయాల పరిరక్షణకు, పరస్పర ఆత్మీయతకు వేదికగా నిలిపే ప్రయత్నం ఈ కార్యక్రమంలో కనిపించింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కంబాలపల్లి గురునాథరెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ పాండురంగరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షురాలు కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు నీల భాను గౌడ్ ఇందూరి శ్రీనివాస్, దొంతరమోని భార్గవి రాజు, ధారు రాఘవేందర్ వర్త్య రామదాసు, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు గౌస్ పాషా, మండల పార్టీ అధ్యక్షులు రావణమోని లింగం, తదితరులు పార్టీ నేతలు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.