- విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ ప్రణాళికా లోపాలే కారణం
- వైటీపీఎస్ సీఈ సురేష్ సస్పెన్షన్ అన్యాయం.. అధికారులను బలిపశువులను చేయొద్దు
- టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్
హైదరాబాద్, మహా : తెలంగాణలో విద్యుత్ సంక్షోభం, నీటి కొరతకు ప్రభుత్వ ప్రణాళికా లోపాలే కారణమని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ విమర్శించారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును సమయానికి సరఫరా చేయడంలో వైఫల్యాలను సరిదిద్దకుండా, ఉత్పత్తి తగ్గిందనే కారణంతో వైటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ సురేష్ను సస్పెండ్ చేయడం అన్యాయమని పేర్కొన్నారు.
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ విద్యుత్ ప్లాంట్లకు తగినంత సరఫరా కాకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గి సంక్షోభ పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. మరోవైపు గోదావరి నదిలో నీటి లభ్యత ఉన్నప్పటికీ ఎత్తిపోతల విషయంలో వైఫల్యాల కారణంగా నీటి కొరత తీవ్రతరమవుతోందని ఆరోపించారు. ప్రజలకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం.. విద్యుత్, నీటి సమస్యలతో పాటు పంటల సాగుపై ఆందోళన కలిగించే ప్రకటనలు చేస్తూ బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
బొగ్గు సరఫరా చేయకుండా అధికారులపై చర్యలా?
విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును సమయానికి సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు జెన్కో యాజమాన్యం, సంబంధిత విభాగాలపై ఉందని దేవీప్రసాద్ పేర్కొన్నారు. అవసరమైన ముడిసరుకు అందుబాటులో లేకపోతే అధికారులు ఎలా విద్యుత్ ఉత్పత్తి చేయగలరని ప్రశ్నించారు. ఉత్పత్తి లక్ష్యాలు సాధించలేదనే కారణంతో క్షేత్రస్థాయి అధికారులపై చర్యలు తీసుకోవడం సమస్యకు పరిష్కారం కాదన్నారు.
స్టేజ్-1పైనే చర్యలెందుకు?
వైటీపీఎస్ స్టేజ్-1లో లోపాలకు బాధ్యుడిగా సురేష్పై చర్యలు తీసుకున్నప్పుడు, స్టేజ్-2లోని పరిస్థితులపైనా సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారులపై చర్యలు తీసుకునే విషయంలో ఒకే విధమైన ప్రమాణాలను పాటించాలని సూచించారు. క్షేత్రస్థాయి అధికారులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని, ఉన్నతస్థాయి అధికారుల బాధ్యతలను విస్మరిస్తే అనుమానాలు తలెత్తుతాయని పేర్కొన్నారు. తెలంగాణ అధికారులపైనే చర్యలు తీసుకుంటున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వైఫల్యాలపై సమగ్ర విచారణ జరపాలి
విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలో బొగ్గు సరఫరా, సాంకేతిక నిర్వహణ, ముందస్తు ప్రణాళిక, యాజమాన్య పర్యవేక్షణ వంటి అంశాలపై సమగ్ర విచారణ జరపాలని దేవీప్రసాద్ కోరారు. ఎవరి తప్పిదం ఉందో నిష్పక్షపాతంగా నిర్ధారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవస్థాగత వైఫల్యాలకు ఉద్యోగులను బలిపశువులను చేయడం అన్యాయమని పేర్కొన్నారు.
తెలంగాణ విద్యుత్ సంస్థల్లో కీలక బాధ్యతల నిర్వహణ, అధికారుల నియామకాలు, బదిలీలు, బాధ్యతల కేటాయింపుల్లో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. కీలక విభాగాల్లో స్థానిక తెలంగాణ అధికారులకు తగిన ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రణాళికా లోపాలను సరిదిద్ది, విద్యుత్ సంస్థల పనితీరుపై సమగ్ర విచారణ జరిపి, ఉద్యోగులు, ఇంజినీర్లలో నెలకొన్న ఆందోళనను తొలగించాలని దేవీప్రసాద్ కోరారు.








