Mahaa Daily Exclusive

  కన్నెర్ర చేసిన సీఎం రేవంత్…

Share

  • కన్నెర్ర చేసిన సీఎం రేవంత్
  • విద్యుత్‌ సరఫరాలో నిర్లక్ష్యంపై చర్యలు
  • యాదాద్రి పవర్‌ స్టేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌పై సస్పెన్షన్ వేటు
  • అలసత్వం వహిస్తే సీఎండీపైనా యాక్షన్

హైదరాబాద్, మహా : రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. తాజాగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో స్టేజ్‌-1 చీఫ్‌ ఇంజినీర్‌ సురేశ్‌ నాయక్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు కొనసాగితే ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ జెన్‌కో సీఎండీతోపాటు ఇతర ఐఏఎస్‌ అధికారులపైనా సస్పెన్షన్‌ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సీఎం హెచ్చరించినట్లు తెలిసింది.

రాష్ట్రంలో ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు రాబోయే 20 రోజులు అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమయంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాల వల్ల పంటలు దెబ్బతినకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బోర్లు, వ్యవసాయ మోటార్లపై ఆధారపడే రైతులకు అవసరమైన విద్యుత్‌ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ రంగానికి విద్యుత్‌ సరఫరా ప్రాధాన్యం సంతరించుకుంది. యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో విద్యుదుత్పత్తి, బొగ్గు సరఫరా అంశాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. గతంలో నిర్వహించిన సమీక్షలో ప్లాంట్‌ పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వ్యవసాయ అవసరాలకు సరిపడా విద్యుత్‌ను అందుబాటులో ఉంచడంతోపాటు థర్మల్‌ కేంద్రాల ఉత్పత్తిని మెరుగుపరచడం, అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

మరోవైపు, విద్యుత్‌ సమస్యలు, పంటపై చీడపీడల దాడులు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని ఫరీద్‌పేట గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలో సాగు చేసిన పది ఎకరాల వరి పంటను తగులబెట్టాడు. విద్యుత్‌ సరఫరా సమస్యలతోపాటు చీడపీడల బెడద కారణంగా పంటను కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పంట పెట్టుబడులు, సాగు ఖర్చులు పెరుగుతున్న తరుణంలో ఇలాంటి ఘటన రైతుల పరిస్థితిపై ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయానికి సకాలంలో విద్యుత్‌ అందకపోతే సాగునీటి మోటార్ల నిర్వహణకు ఆటంకం ఏర్పడి పంటలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన హెచ్చరికలు జారీ చేసింది. విద్యుత్‌ సరఫరాను పర్యవేక్షించడంతోపాటు పంటల పరిస్థితిని అంచనా వేసి రైతులకు అవసరమైన సహాయం అందిస్తోంది.