Mahaa Daily Exclusive

  పాకిస్థాన్‌లో ఘోర విషాదం..

Share

  • పాకిస్థాన్‌లో ఘోర విషాదం
  • పాఠశాల పైకప్పు కూలి 28 మంది చిన్నారులు మృతి
  • భారీ వర్షాలకు కూలిన రెండంతస్తుల స్కూల్ భవనం
  • 47 మందికి గాయాలు
  • శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానం

పెషావర్, మహా : పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వాయవ్య పాకిస్థాన్‌లోని పెషావర్ నగరంలో భారీ వర్షాల కారణంగా పాఠశాల పైకప్పు కూలిపోవడంతో 28 మంది చిన్నారులు, ఒక ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో కనీసం 47 మంది పిల్లలు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండవచ్చనే అనుమానంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పెషావర్‌లోని అల్ ఖైర్ పబ్లిక్ స్కూల్ రెండంతస్తుల భవనం పైకప్పు రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు బలహీనపడి కూలిపోయింది. స్థానిక రెస్క్యూ సేవల అధికారి బిలాల్ అహ్మద్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాయి.

47 మంది చిన్నారులకు గాయాలు

ఈ ప్రమాదంలో గాయపడిన కనీసం 47 మంది పిల్లలను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రి ప్రతినిధి ఆసిమ్ ఖాన్ తెలిపారు. గాయపడిన వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తూ బాధితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ప్రమాద స్థలానికి సంబంధించిన వీడియోల్లో ఇరుకైన వీధుల గుండా అంబులెన్సులు వెళ్తుండగా, పాఠశాల భవనం వెలుపల పెద్ద సంఖ్యలో స్థానికులు గుమిగూడిన దృశ్యాలు కనిపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అత్యవసర సిబ్బంది కొద్ది నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొన్న ప్రత్యక్ష సాక్షుల కథనాలు వెల్లడించాయి.

దర్యాప్తునకు అధ్యక్షుడు ఆదేశం

ఈ ఘటనపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని హృదయ విదారక విషాదంగా అభివర్ణిస్తూ, ఘటనకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. “ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాల దుఃఖంలో దేశం మొత్తం పాలుపంచుకుంటోంది” అని అధ్యక్షుడి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొంది.

భవన నిర్మాణ నాణ్యతపై ఆందోళనలు

పాకిస్థాన్‌లో భవనాలు కూలిపోతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. నిర్మాణ నిబంధనల అమలులో లోపాలు, నాణ్యత లేని నిర్మాణ సామగ్రి వినియోగం వంటి అంశాలు ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. తాజా ఘటనతో పాఠశాల భవనాల భద్రత, నిర్మాణ ప్రమాణాల అమలుపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. ఇటీవలే పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 14 మంది నవజాత శిశువులు మరణించారు. ఆసుపత్రి మూడో అంతస్తులోని శిశువుల వార్డులో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించడంతో, అక్కడ చికిత్స పొందుతున్న 15 మంది శిశువుల్లో ఒక్కరిని మాత్రమే సిబ్బంది రక్షించగలిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై జరిగిన విచారణలో శిశువుల వార్డులో ఫైర్ అలారం, స్ప్రింక్లర్ వ్యవస్థలు లేవని గుర్తించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే విధానాలు, సిబ్బందికి ఇచ్చిన శిక్షణలోనూ లోపాలు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.

ఇదిలా ఉండగా, ఈ ఏడాది జూలైలో తూర్పు పాకిస్థాన్‌లోని లాహోర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ షన్ సెంటర్ పైకప్పు కూలిపోవడంతో కనీసం 14 మంది విద్యార్థులు మరణించారు. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ విషాద ఘటనలు పాకిస్థాన్‌లో పాఠశాలలు, ఆసుపత్రులు సహా ప్రజలు వినియోగించే భవనాల భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. నిర్మాణ నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు అత్యవసర భద్రతా ప్రమాణాలను పటిష్ఠం చేయాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదాలు మరోసారి గుర్తుచేస్తున్నాయి.