Mahaa Daily Exclusive

  న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు…

Share

  • న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు
  • రాహుల్‌ సహా ఇండీ కూటమి నేతలకు సుప్రీం నోటీసులు
  • సుప్రీంకోర్టు వరకు విపక్ష నేతలు చేపట్టిన పాదయాత్రపై అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయస్థానం
  • న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలను అంగీకరించబోమని స్పష్టం

న్యూఢిల్లీ, మహా : కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో విపక్ష నేతలు చేపట్టిన పాదయాత్రపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ నిరసనలతో న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకురావాలని చూడటం సరికాదని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరని వ్యాఖ్యానించింది. ఆ వ్యవహారంలో రాహుల్‌ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సహా సంబంధిత పిటిషనర్లకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై విపక్ష నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్నికల సంఘం వివరణ కోరింది.

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ‘మార్చ్‌ ఫర్‌ డెమోక్రసీ’ పేరుతో అక్టోబర్‌ 12న ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టు వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ ర్యాలీలో పలువురు విపక్ష నేతలతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఓటర్ల జాబితా సవరణలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును సవాల్‌ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజకీయ పాదయాత్రలు న్యాయస్థానం వరకు రావడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరని పేర్కొంది.

పిటిషన్‌పై నోటీసులు జారీ చేసినంత మాత్రాన రాజకీయ నేతల ప్రవర్తనను సమర్థించినట్లు కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. పాదయాత్ర, నిరసనలకు సంబంధించిన అంశాలపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, రాహుల్‌ గాంధీ, అఖిలేశ్‌ యాదవ్‌ సహా సంబంధిత పిటిషనర్ల నుంచి వివరణ కోరింది. పిటిషనర్లలో ఒకరి వ్యవహారశైలిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రత్యేకంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. తదుపరి విచారణ సమయంలో ఆయన తీరుపై ప్రశ్నలు అడుగుతామని తెలిపారు. ఆ పిటిషనర్‌ తన ప్రవర్తనపై వివరణ ఇచ్చే వరకు ఆయన తరఫున జారీ చేసిన నోటీసును తాత్కాలిక ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈసీకి నోటీసులు

ఇదిలా ఉండగా, ఓటర్ల జాబితాలో భారీగా పేర్లు తొలగిస్తున్నారంటూ రాహుల్‌ గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలు మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషికి నోటీసులు జారీ చేసింది. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన వారి పేర్లను తొలగించకుండా చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు కోరారు. ఎవరి పేరునైనా తొలగించే ముందు నోటీసు ఇవ్వాలని, తమ వాదన వినిపించుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తొలగించిన ఓటర్ల వివరాలను బూత్‌ల వారీగా ప్రచురించడంతో పాటు, పేర్లు తొలగించడానికి గల కారణాలను వెల్లడించాలని కోరారు. SIR ప్రక్రియలో జరిగిన మార్పులు, తొలగింపులపై స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించాలని ప్రతిపాదించారు. ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునే వరకు కొనసాగుతున్న సవరణ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, ఎన్సీపీ (శరద్‌ పవార్‌) నేత సుప్రియా సూలే, శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ తదితరులు ఉన్నారు.

జంతర్​ మంతర్​ విషయంపై విచారణ

మరోవైపు, దిల్లీలో నిరసనలకు వేదికగా ఉన్న జంతర్‌మంతర్‌ను అధికారిక నిరసన ప్రదేశంగా గుర్తించడాన్ని ఉపసంహరించడంపై దాఖలైన పిటిషన్‌నూ సుప్రీంకోర్టు విచారించింది. ఆ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను, సుప్రీంకోర్టు ప్రాంగణంలోని రికార్డింగ్‌లతో సహా భద్రపర్చాలని ఆదేశించింది.