- యాదాద్రి ధర్మల్ ప్లాంట్ వద్ద ఐఏఎస్ అధికారుల క్యాంపు
- ఐదుగురు అధికారులను నియమించిన ప్రభుత్వం
- ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
హైదరాబాద్, మహా : నల్గొండ జిల్లా దామరచర్ల లోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. థర్మల్ పవర్ ప్లాంట్ లో క్షేత్రస్థాయి పరిశీలన చేసి సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేక చొరవ చూపుతుంది. అందుకు సంబంధించి ఐదుగురు ఐఏఎస్ అధికారులను నియమించింది. పవర్ ప్లాంట్ వద్ద విడతల వారీగా విధులు నిర్వహిస్తూ పరిశీలన చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
అక్టోబర్ 15వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు 15 రోజులపాటు ఈ సీనియర్ అధికారులు పవర్ ప్లాంట్ వద్దనే ఉండి పరిశీలించనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఐఏఎస్ అధికారులు హరి కిరణ్ అక్టోబర్ 15 నుంచి 17వ తేదీ వరకు, వెంకటేష్, దోత్రి అక్టోబర్ 18,19 తేదీలలో, రాహుల్ రాజ్ అక్టోబర్ 22 నుంచి 24వ తేదీ వరకు, జెండేజ్ హనుమంతు కొండిబ అక్టోబర్ 25 నుంచి 27వ తేదీ వరకు, కిల్లు శివకుమార్ నాయుడు అక్టోబర్ 28 నుంచి 30వ తేదీ వరకు క్యాంపు నిర్వహించి పవర్ ప్లాంట్ వద్ద ప్రత్యేకంగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ప్లాంటుకు సంబంధించిన బొగ్గు స్ట్రీమ్ లు పనిచేస్తున్నాయా..? ఏవైనా అంతరాయాలు ఉన్నాయా..? గ్రేడ్ కు తగినట్టుగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందా..? లేదా..? బొగ్గు సరఫరా నిరంతరాయంగా సాగుతుందా..? ఆటంకాలు ఏమైనా ఉన్నాయా.? అనే విషయంపై ఈ ఐదుగురు ఐఏఎస్ అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సి ఉంది.







