- తిరుమలలో ఘాట్ రోడ్ లో ద్విచక్ర వాహనాలపై
- 15 రాత్రి నుంచి 17 ఉదయం వరకు ఆంక్షలు
- గరుడవాహన సేవ నేపథ్యంలో టీటీడీ నిర్ణయం
తిరుమల, మహా : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 16న నిర్వహించనున్న గరుడవాహన సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో తిరుమలకు వెళ్లే రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధించింది. అక్టోబర్ 15 రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 17 ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు శ్రీవారి గరుడవాహన సేవ జరగనుంది. ఈ సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఘాట్ రోడ్లపై వాహనాల రద్దీని నియంత్రించడంతో పాటు భక్తుల ప్రయాణం సురక్షితంగా సాగేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను తిరుపతిలోని నిర్దేశిత పార్కింగ్ స్థలాల్లో నిలిపి, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు చేరుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ సూచించారు. భక్తులు పోలీసు, టీటీడీ అధికారుల సూచనలను పాటిస్తూ ప్రయాణ ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు. గరుడవాహన సేవకు వచ్చే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన సమయంతో తిరుపతికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షల సమయంలో సహకరించాలని, ప్రయాణానికి సంబంధించి అధికారికంగా ప్రకటించే సూచనలను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.







