- నకిలీ ఎఫ్ఎంసి తో భూముల మ్యుటేషన్‌కు యత్నం
- మహిళ పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు
- దర్యాప్తు చేపట్టిన మిల్స్ కాలనీ పోలీసులు
ఖిలా వరంగల్,మహా ;
వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం లోని మండల కార్యాలయాల్లో కొంతమంది దళారులు ఏకంగా తహసీల్దార్ సంతకాలతో పాటు ముద్రలను కూడా సృష్టించి భూముల రిజిస్ట్రేషన్ కోసం నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లను తయారు చేసిన ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలోనే నకిలీ పత్రాల విషయంలో కొంతమంది నిందితుల పై కేసులు కూడా నమోదు అయ్యాయని తెలుస్తోంది. భూముల మ్యుటేషన్ కోసం నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సృష్టించిన వ్యవహారం వరంగల్ లో మరోసారి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధ్రువపత్రం పై ఖిలా వరంగల్ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ ముద్రను ఉపయోగించినట్లు తహసీల్దార్ చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కరీమాబాద్‌కు చెందిన మెహరున్నీసా బేగం పై ఏజే మిల్స్ కాలనీ పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎఫ్ఐఆర్ నంబర్ 780/2026 తో అక్టోబర్ 17, 2026న రాత్రి 10 గంటలకు కేసు నమోదైంది. ఖిలా వరంగల్ తహశీల్దార్ ఎం.డి. ఇక్బాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 318(4), 336(3), 340(2), 337 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ శివరాత్రి మహేష్ దర్యాప్తు చేస్తున్నారు. కరీమాబాద్ కు చెందిన మెహరున్నీసా బేగం తన భర్త దివంగత మహమ్మద్ అబ్దుల్ రహీం పేరుతో ఉన్నట్లు పేర్కొంటూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ను ఆత్మకూరు తహసీల్దార్ కు సమర్పించారు. సర్టిఫికెట్ నంబర్ సి/3223/2026, తేదీ 08-01-2026గా ఉంది. దీని ప్రామాణికత పై అనుమానం రావడంతో ఆత్మకూరు తహసీల్దార్ ఖిలా వరంగల్ తహశీల్దార్ కార్యాలయాన్ని వివరణ కోరగా అసలు వ్యవహారం బయటపడింది.
ఎమ్మార్వో జారీ చేయని ధ్రువపత్రం
వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఖిలా వరంగల్ మండలం తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులు, పంపిణీ రిజిస్టర్ ను పరిశీలించగా, 2026లో ఆ నంబరుతో ఎలాంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ కాలేదని తేలినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సదరు ధ్రువపత్రం నకిలీదిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తహసీల్దార్ సంతకం, కార్యాలయ ముద్రను కూడా నకిలీగా ఉపయోగించినట్లు ఫిర్యాదులో వివరించారు. ఇతర వారసుల పేర్లను చేర్చకుండా నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సృష్టించి, ప్రధానమైన వ్యవసాయ భూములను తమ పేర్లపైకి మ్యుటేషన్ చేయించుకునేందుకు ప్రయత్నించినట్లు తహసీల్దార్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ వ్యవహారంలో జైనాబీ, మహమ్మద్ అబ్దుల్ రహీం, మెహరున్నీసా బేగం, మహమ్మద్ పర్వేజ్ పేర్లను ప్రస్తావించారు.
క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఖిలా వరంగల్ మండల తహశీల్దార్ ఎం.డి. ఇక్బాల్ ఆర్సీ నంబర్ సి/2912/2026తో అక్టోబర్ 17న ఏజే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ అధికారులకు లేఖ రాశారు. మెహరున్నీసా బేగం (ఇంటి నంబర్ 16-1-881, కరీమాబాద్) పై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ధ్రువపత్రం తయారీ వెనుక మరెవరైనా ఉన్నారా? ఇలాంటి నకిలీ పత్రాలు మరిన్ని సృష్టించారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








