- భారత సైన్యం భాగస్వామ్యంతో కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం!
న్యూఢిల్లీ, మహా.
ఆధునిక యుద్ధ తంత్రాలు, సైబర్ దాడులు మరియు డ్రోన్ ముప్పులను సమర్థవంతంగా తిప్పికొట్టేలా దేశంలోని పౌర రక్షణ దళాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భారత సైన్యం ప్రత్యక్ష భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ‘వైబ్రెంట్ సివిల్ డిఫెన్స్ నెట్వర్క్’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. దేశ సరిహద్దుల రక్షణతో పాటు అంతర్గత భద్రతను పటిష్టం చేయడం, అత్యవసర సమయాల్లో పౌర రక్షణ వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఈ తొలి విడత కార్యక్రమంలో భాగంగా దేశంలోని 12 వివిధ రాష్ట్రాలకు చెందిన 600 మంది మాస్టర్ ట్రైనర్లకు ప్రత్యేక సైనిక కేంద్రాల్లో కఠిన శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న మాస్టర్ ట్రైనర్లు తదుపరి దశలో తమ ప్రాంతాల్లో మొత్తం 60,000 మంది సివిల్ డిఫెన్స్ వాలంటీర్లను తయారు చేస్తారు. ఒక్కో మాస్టర్ ట్రైనర్ సుమారు 100 మంది వాలంటీర్లకు శిక్షణనివ్వడం ద్వారా అతి తక్కువ సమయంలోనే ఈ రక్షణ నెట్వర్క్ను దేశమంతటా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో సైనిక నిపుణుల పర్యవేక్షణలో అత్యంత కీలకమైన అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రధానంగా కీలక మౌలిక సదుపాయాల పరిరక్షణ, అగ్నిమాపక భద్రత, రసాయన, జీవ, రేడియోధార్మిక, అణు ముప్పులను ఎదుర్కోవడం, ఆధునిక హైబ్రిడ్ యుద్ధ వ్యూహాలు, డ్రోన్ దాడులను తిప్పికొట్టడం, వైమానిక దాడి ముప్పుల నుంచి రక్షణ పొందడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. వీటితో పాటు శోధన మరియు సహాయక చర్యలు, అత్యవసర సమాచార ప్రసారం, డిజిటల్ నెట్వర్క్ భద్రత, పౌర-సైనిక సమన్వయం వంటి సమకాలీన అంశాలను కూడా ఈ సిలబస్లో చేర్చారు.
ఈ ఏడాది ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఆధునిక సాంకేతికత, సమకాలీన స్పందన సామర్థ్యాలతో కూడిన బలమైన పౌర రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆకాంక్షించిన విషయం తెలిసిందే. ప్రధాని ఆశయాలకు అనుగుణంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ సంయుక్త పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాథమిక ప్రయోగం విజయవంతమైన తర్వాత, ఈ సమగ్ర పౌర రక్షణ శిక్షణా కార్యక్రమాన్ని దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు దశలవారీగా విస్తరించనున్నట్లు హోం శాఖ స్పష్టం చేసింది.







