- సీపీఐ నేతలను కోరిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ఆ పార్టీ నేతలు వామపక్ష పార్టీ అయిన సీపీఐని కోరారు. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కాంగ్రెస్, సీపీఐ ప్రధాన నాయకుల కీలక సమావేశం జరిగింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పరస్పర సహకారంపై ఇరు పార్టీల నేతలు చర్చలు జరిపారు.
ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి తదితర ప్రముఖ కాంగ్రెస్ నాయకులు పాల్గొనగా.. వారిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జాతీయ కార్యవర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.
అలాగే ఈ భేటీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్ బోస్, ఈటీ నరసింహ, తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, కలవేని శంకర్, బాల నరసింహ తదితరులు సైతం హాజరయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ విధానాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మిత్రపక్షాల మద్దతు ఎంతో కీలకమని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం వామపక్షాలు తమ వంతు సహకారాన్ని అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇరు పార్టీల మధ్య జరిగిన ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.








