Mahaa Daily Exclusive

  కూటమి వ్యూహంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక భేటీ.

Share

  •  జెడ్పీ స్థానాల సర్దుబాటుపై కసరత్తు!

అమరావతి, మహా.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా మారుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరం వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ తరుణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య అత్యంత కీలకమైన సమావేశం ముగిసింది. సీఎం నివాసానికి కాన్వాయ్‌తో విచ్చేసిన పవన్ కల్యాణ్, చంద్రబాబుతో సుమారు అరగంట పాటు భేటీ అయ్యి రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, జిల్లా పరిషత్ స్థానాల సర్దుబాటు తదితర అంశాలపై లోతుగా చర్చించారు.

గతంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో అనుసరించిన సీట్ల సర్దుబాటు ఫార్ములాను ప్రాతిపదికగా తీసుకుని, రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ టీడీపీ, జనసేన మధ్య సముచిత రీతిలో స్థానాల కేటాయింపు ఉండేలా ఇరువురు నేతలు మంతనాలు జరిపారు. ఇందులో భాగంగా జనసేన పార్టీ సుమారు 7 లేదా 8 జిల్లా పరిషత్ స్థానాలను కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పార్టీకి పట్టున్న, అనుకూలంగా ఉన్న స్థానాలను గుర్తించి సీట్ల సర్దుబాటును వీలైనంత త్వరగా కొలిక్కి తేవడంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఇదిలాఉంటే, స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వంలో కొన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో టీడీపీ – జనసేన నాయకులు, కార్యకర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి ఘర్షణ వాతావరణం, ఆశావహుల మధ్య నెలకొన్న పోటీ పరిస్థితులపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు, అభ్యంతరాలు తలెత్తకుండా నాయకులు, కార్యకర్తలు పూర్తి సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఐక్యతను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తూ, పరస్పర సహకారంతో ప్రతి స్థానంలోనూ విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్లేలా దిశానిర్దేశం చేసే సంకేతాలపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.