Mahaa Daily Exclusive

  ధాన్యం, బియ్యం అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం…

Share

ధాన్యం, బియ్యం అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం.
* 16 మంది రైస్ మిల్లర్ల అరెస్ట్!
* రూ.96 కోట్ల ప్రభుత్వ ధాన్యం పక్కదారి.
* నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్‌తో పాటు పలు జిల్లాల్లో విస్తృత దర్యాప్తు!
హైదరాబాద్, మహా.

తెలంగాణలో ప్రభుత్వ ధాన్యం మరియు బియ్యం నిల్వలకు సంబంధించి భారీ అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వానికి చెందాల్సిన ధాన్యాన్ని దొడ్డిదారిన పక్కదారి పట్టించి, బియ్యం సరఫరాలో అవకతవకలకు పాల్పడినట్లు అందిన పక్కా ఫిర్యాదుల ఆధారంగా సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా పలువురు రైస్ మిల్లర్లను అదుపులోకి తీసుకోగా.. ఇప్పటివరకు మొత్తం 16 మందిని అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌తో పాటు ములుగు, మెదక్ తదితర జిల్లాల్లోని పలు రైస్ మిల్లర్ల వ్యవహారాలపై సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రభుత్వానికి అప్పగించాల్సిన వేల టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా పక్కదారి పట్టించడంతో పాటు, లబ్ధిదారులకు సరఫరా చేయాల్సిన సన్న బియ్యం స్థానంలో దొడ్డు బియ్యం అంటగట్టినట్లు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. పౌరసరఫరాల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో జరిపిన విచారణ తాలూకు వివరాలను అందజేయడంతో సీఐడీ రంగంలోకి దిగింది.
పౌరసరఫరాల శాఖ అందించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వ ధాన్యం నిల్వలు, మిల్లింగ్ రికార్డులు, బియ్యం సరఫరా పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మిల్లర్ల ఈ అక్రమాల కారణంగా ప్రభుత్వానికి సుమారు రూ.96 కోట్ల మేర భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రభుత్వ ధాన్యాన్ని ఇతర మార్గాల్లో అమ్ముకున్నారా? ధాన్యం నిల్వలు, సరఫరా లెక్కల్లో ఈ అవకతవకలు ఎలా జరిగాయి? ఈ వ్యవహారంలో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని పూర్తిగా రికవరీ చేసేందుకు సంబంధిత శాఖలు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాయి.