రెండో పంట సాగు చెయ్యొద్దు.
* రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచన!
ఖమ్మం, మహా.
రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులను, ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు రెండో పంట సాగు జోలికి వెళ్లొద్దని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎల్నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ లభ్యత కూడా సవాళ్లతో కూడుకున్నదని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ కరవు పరిస్థితులపై త్వరలోనే ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి, ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా తగిన సూచనలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. పేదలకు మంచి చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయదని స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో ఆదివారం రూ.38 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన వివిధ రహదారి అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నేడు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం చేసి చూపుతుంటే, ఆ పార్టీ నేతలు ఓర్వలేక ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి కుంటుపడనీయమని తేల్చిచెప్పారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ, పేద ప్రజల సంక్షేమం కోసం అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మొదటి పంట సాగు చేసిన రైతులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలిచి ఆదుకుందని గుర్తుచేశారు. ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమది కాదన్న చిన్నచూపు తెలంగాణ పట్ల ఉండకూడదని రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలకు ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తగిన ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకు రావాల్సిన నిధులను వెంటనే సాధించుకుని రావాలని హితవు పలికారు. కరవు పరిస్థితుల వంటి క్లిష్ట సమయాల్లో రైతులు, ప్రజలు ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలని మంత్రి పొంగులేటి కోరారు.








