తెలంగాణలో తీవ్ర కరువు పరిస్థితులు.
* కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే కారణం.
* బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్య
హైదరాబాద్, మహా.
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, ప్రణాళికా లోపంతోనే తెలంగాణలో తీవ్ర కరువు పరిస్థితులు దాపురించాయని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సస్యశ్యామలంగా పాడిపంటలతో విలసిల్లిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు అతికొద్ది కాలంలోనే కరువు తెలంగాణగా మార్చేశారని విమర్శించారు.
గత ఫిబ్రవరి నుంచే కేంద్ర ప్రభుత్వంతో పాటు శాస్త్రవేత్తలు ఎల్ నినో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ లభ్యతను గానీ, రిజర్వాయర్లలో నీటి నిల్వలను గానీ సమన్వయం చేసుకోకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించిందని ఆరోపించారు. ఇప్పుడు తమ వైఫల్యాన్ని ఎల్ నినో మాటున కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రికార్డుల కోసం కేవలం 365 మండలాల్లోనే కరువు ఉన్నట్లు జీవో ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, వాస్తవానికి రాష్ట్రంలో 90 శాతానికి పైగా మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఖరీఫ్ సీజన్లో సరైన విద్యుత్, సాగునీరు అందించకపోవడం వల్ల దాదాపు 18 శాతం విస్తీర్ణంలో సుమారు 13 లక్షల ఎకరాలకు పైగా వరి పంట పూర్తిగా ఎండిపోయిందని లక్ష్మీనర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రబీ సీజన్లో రైతులపై ఒత్తిడి తెస్తూ, విత్తన కేంద్రాల్లో వ్యవసాయ అధికారులు రైతుల నుంచి బాండ్ పేపర్లు రాయించుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. పంట ఎండినా, నష్టం వచ్చినా ప్రభుత్వానికి సంబంధం లేదని బాండ్ పేపర్లు రాయించుకుంటూ అన్నదాతలను ప్రభుత్వం నట్టేట ముంచుతోందని విమర్శించారు. వరి వేయవద్దంటున్న ప్రభుత్వం, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లలో అక్రమాలకు పాల్పడితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంథాను కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికారంలోకి రాకముందు అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, గద్దెనెక్కాక ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు తీసుకోలేదని, ఫలితంగా నీటి సరఫరా లేక రైతులు నష్టపోవాల్సి వస్తోందని అన్నారు. ఈ వైఫల్యాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు తక్షణమే జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మొక్కుబడిగా అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి చేతులు దులుపుకోవడం కాదని, కేంద్రంపై నెపం నెట్టడానికి ముందు గ్రామీణ రైతాంగాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలేమిటో స్పష్టంగా చెప్పాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతను గుర్తించి వెంటనే ఆర్థిక చేయూతనిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు బీజేపీ కిసాన్ మోర్చా పలు కీలక డిమాండ్లను ఉంచింది. ఖరీఫ్‌లో పంట నష్టపోయిన సుమారు 13 లక్షల ఎకరాలకు గాను ఎకరానికి రూ.30,000 చొప్పున ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, కరువు తీవ్రత ఉన్న 365 మండలాల్లో రైతుల సంక్షేమం, సహాయక చర్యల కోసం మండలానికి రూ.10 కోట్ల చొప్పున తక్షణమే నిధులు మంజూరు చేసి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పంటలు ఎండిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల బ్యాంకు రుణాల రికవరీని తక్షణమే నిలిపివేసి, రుణాలను రీషెడ్యూల్ చేయాలని కోరారు. గ్రామాల నుంచి రైతులు, రైతు కూలీలు వలసలు వెళ్లకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రకటించాలని, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద 125 పనిదినాలు కల్పించి రాష్ట్రంలో పనుల కోసం తన 60 శాతం వాటాగా రూ.3,825 కోట్లు కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా నిధులను జమ చేసి వ్యవసాయ కూలీలను, కౌలు రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అశోక్ ముస్తాపురే, కిసాన్ మోర్చా నాయకులు అశోక్ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.








