Mahaa Daily Exclusive

  రష్యా బోర్డర్‌ లో చిక్కుకున్న ఐదుగురు భారతీయ యువకులు…

Share

  • రష్యా బోర్డర్‌ లో చిక్కుకున్న ఐదుగురు భారతీయ యువకులు…
  • ముగ్గురు అనకాపల్లి జిల్లా వాసులు
  • వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు కన్నీటి వేడుకోలు

అనకాపల్లి, మహా : ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ యువకులకు రష్యాలో కష్టాలు ఎదురయ్యాయి. ఉద్యోగాల పేరుతో రష్యాకు వెళ్లిన ఐదుగురు భారతీయ యువకులు ప్రస్తుతం రష్యా సరిహద్దు ప్రాంతంలో చిక్కుకున్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురు అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్కవరం గ్రామానికి చెందిన బైలపూడి నాగరాజు, నాగిరెడ్డి రాజుబాబు, చౌడువాడ గ్రామానికి చెందిన విభూది సతీష్, గాజువాక దువ్వాడ గ్రామానికి చెందిన జట్టు వంశీ చోడవరం, మాడుగుల నియోజకవర్గం చెందిన ఈ ఇద్దరు యువకులతో పాటు మరో ముగ్గురు భారతీయులను నేపాల్‌కు చెందిన ఓ వ్యక్తి ఉద్యోగాల పేరుతో రష్యాకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని బాధిత యువకులు తమ వీడియో సందేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.

తమను వేరే ప్రయోజనంతో రష్యాకు పంపించి, అనంతరం రష్యా పౌరులుగా పరిగణిస్తూ రష్యా బోర్డర్ ప్రాంతానికి పంపించారని యువకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ ప్రాణాలకు ముప్పు ఉందని వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేశారు. తమను ఎలాగైనా సురక్షితంగా భారతదేశానికి తీసుకురావాలని, భారత ప్రభుత్వం వెంటనే స్పందించి తమ ప్రాణాలను కాపాడాలని బాధిత యువకులు కన్నీటి పర్యంతమవుతూ విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు తమ కుటుంబ సభ్యులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియక బాధితుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన యువకులు ఇలా ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర విదేశాంగ శాఖ వెంటనే స్పందించి, రష్యాలో చిక్కుకున్న ఐదుగురు భారతీయ యువకులను గుర్తించి సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. బాధిత యువకులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.