పెదాలు గులాబీ రంగులో నిగనిగలాడుతుంటే ముఖానికి ప్రత్యేకమైన ఆకర్షణ వస్తుంది. అయితే చాలామందిలో ధూమపానం, సరిపడా నీరు తాగకపోవడం వల్ల వచ్చే డీహైడ్రేషన్, నాణ్యతలేని రసాయనాలు కలిగిన లిప్స్టిక్స్ లేదా లిప్బామ్స్ వాడటం వల్ల పెదాలు నల్లగా మారి పిగ్మెంటేషన్ సమస్య తలెత్తుతుంది. దీనిని కప్పిపుచ్చడానికి బయట నుంచి కాస్మెటిక్స్ ఎన్ని వాడినా అది తాత్కాలిక పరిష్కారమే తప్ప లోపలి సమస్య అలాగే ఉండిపోతుంది. పెదాల నలుపు తగ్గించుకోవడానికి సోషల్ మీడియాలో కనిపించే గుడ్డి చిట్కాలను నమ్మకుండా, చర్మ సమస్యల నిపుణులను సంప్రదించి సరైన కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవడమే సురక్షితమైన మార్గమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
సాధారణంగా నలుపు తగ్గేందుకు ఇంట్లో వాడే నిమ్మరసం, బేకింగ్ సోడా వంటి తీవ్రమైన పదార్థాల వల్ల ఫలితం కంటే పెదాల సున్నితమైన చర్మం దెబ్బతినే ప్రమాదమే ఎక్కువ. అందుకే సమస్య తీవ్రతను బట్టి డెర్మటాలజిస్టులు సూచించే ప్రత్యేక మెడికేటెడ్ క్రీమ్స్ లేదా నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయించుకునే ‘కెమికల్ పీల్స్’ విధానాలు మంచి ఫలితాన్నిస్తాయి. కెమికల్ పీల్ ప్రక్రియలో పెదాలను క్లెన్స్ చేసి, ప్రత్యేకమైన సురక్షిత యాసిడ్ల సహాయంతో లోపలి పొరల వరకు చికిత్స అందించి చర్మాన్ని రీజెనరేట్ చేస్తారు. ఇది పెదాల చుట్టూ ఉండే భాగాలకు హాని కలగకుండా చాలా జాగ్రత్తగా చేయాల్సిన ప్రక్రియ కావడంతో కేవలం నిపుణుల సమక్షంలోనే చేయించుకోవాలి.
ఈ చికిత్సలతో పాటు పెదాల సంరక్షణలో నిత్యం కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. రోజంతా పెదాలు తేమగా ఉండేలా ఫ్రాగ్రెన్స్ లేని మంచి మాయిశ్చరైజర్లు వాడటంతో పాటు ఎండలోకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉండే లిప్బామ్లను మాత్రమే ఎంచుకోవాలి. పెదాలను తరచూ నాలుకతో నాకడం, దంతాలతో కొరకడం లేదా గట్టిగా రుద్ది స్క్రబ్ చేయడం వంటి అలవాట్లకు స్వస్తి పలకాలి. సరైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు నిపుణుల సంరక్షణ తోడైతే పెదాలు సహజసిద్ధంగా ఆరోగ్యంగా, మృదువుగా మరియు ఎర్రగా మారతాయి.







