- వీబీజీ రామ్జీలో ఆల్టైమ్ రికార్డు
- ఒకే రోజు ఐదు లక్షలకు పైగా కూలీలకు ఉపాధి
- ఉపాధి హామీ చరిత్రలోనే నవంబర్ లో తొలిసారి ఈ స్థాయిలో పని కల్పన
- ఇదే స్ఫూర్తితో మరిన్ని పనిదినాలు కల్పించాలి: మంత్రి సీతక్క
హైదరాబాద్, మహా : వీబీజీ రామ్జీ పథకం అమలులో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించింది. నవంబర్ 3న రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా కూలీలకు ఒకే రోజు ఉపాధి కల్పించడం విశేషం. ఈ స్థాయిలో ఒకే రోజున కూలీలకు పని కల్పించడం ఇదే తొలిసారి. ఈ రికార్డును కొనసాగిస్తూ, రానున్న రోజుల్లో మరిన్ని పనిదినాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
ఉపాధి హామీ పనుల ద్వారా కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాల్లో జల సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టే పనులు, నీటి వనరుల అభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతం వంటి పనులను చేపట్టాలని స్పష్టం చేశారు. కూలీలకు ఉపాధి కల్పించడం, నీటి వనరులను సంరక్షించడం, గ్రామాలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే శాశ్వత ఆస్తులను సృష్టించడం అనే మూడు లక్ష్యాలతో ఉపాధి హామీ పనులు కొనసాగాలని మంత్రి సీతక్క ఆదేశించారు.
ప్రతి గ్రామంలో స్థానిక అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి, కూలీలకు నిరంతరం పని లభించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఉపాధి కల్పనతో గ్రామీణ పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించడంతోపాటు గ్రామాల అభివృద్ధికి కూడా దోహదపడేలా పనుల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పేర్కొన్నారు.







