- నరకాసుర వధ కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలి
- బల్దియా కమిషనర్ టి.వెంకన్న
- రంగలీల మైదానం, రంగశాయిపేటలో ఏర్పాట్ల పరిశీలన
- పారిశుద్ధ్యం, లైటింగ్, తాగునీటి సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వహించరాదు
- అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలి
కార్పొరేషన్, మహా ;
నరకాసుర వధ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రజలకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు.
ఈ నెల 6వ తేదీన వరంగల్‌లోని రంగలీల మైదానంతో పాటు రంగశాయిపేటలోని మహాకాళి దేవాలయం సమీపంలో నిర్వహించనున్న నరకాసుర వధ కార్యక్రమాల ఏర్పాట్లను బుధవారం కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బల్దియా తరఫున చేపట్టాల్సిన పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు, తాగునీటి సరఫరా తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వరాదని స్పష్టం చేశారు.
అనంతరం కాశీబుగ్గలో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాల్ పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఉనికిచర్లలో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించిన కమిషనర్, అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
కమిషనర్ వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్ కుమార్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ విభాగాల సిబ్బంది తదితరులు ఉన్నారు.








