హైదరాబాద్‌పై పెరుగుతున్న ఆసక్తి
ఐటీ, వైద్య రంగాల అభివృద్ధి, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలతో హైదరాబాద్ కూడా ఎన్‌ఆర్‌ఐలకు ఆకర్షణీయమైన రియల్ ఎస్టేట్ కేంద్రంగా ఎదుగుతోంది. ముఖ్యంగా నగర పశ్చిమ, వాయవ్య ప్రాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానమైన నివాస ప్రాంతాలపై ఆసక్తి పెరుగుతోంది. ఉద్యోగ కేంద్రాలకు సులభంగా చేరుకునే అవకాశం, రవాణా సదుపాయాలు కొనుగోలు నిర్ణయాల్లో కీలకంగా మారుతున్నాయి.
ఎన్‌ఆర్‌ఐ కుటుంబాలు ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు తల్లిదండ్రుల భవిష్యత్తు అవసరాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నాయని నివేదికలు చెబుతున్నాయి. వైద్య సేవలకు చేరువగా ఉండటం, సామాజిక సంబంధాలు, బహిరంగ ప్రదేశాలు, అవసరమైనప్పుడు సహాయం అందే సదుపాయాలు కూడా ముఖ్యమని వివరించారు. దీంతో స్వదేశంలో స్థిరాస్తి కొనుగోలు నిర్ణయాలు కేవలం పెట్టుబడికే పరిమితం కాకుండా కుటుంబ అవసరాలతోనూ ముడిపడుతున్నాయి.








