Mahaa Daily Exclusive

  ఈ20 పెట్రోల్ కాస్తా ‘ఈ420’గా మారింది.

Share

  • కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర ధ్వజం!
  • పెట్రోల్‌లో 31 శాతం ఇథనాల్ కలుపుతున్నారా?

న్యూఢిల్లీ, మహా.

దేశవ్యాప్తంగా వాహనదారులు వినియోగిస్తున్న ఈ20 (20 శాతం ఇథనాల్ బ్లెండెడ్) పెట్రోల్ వ్యవహారం ఇప్పుడు ఒక కొత్త రాజకీయ దుమారానికి తెరతీసింది. పెట్రోల్‌లో నిర్ణీత 20 శాతం మేర ఇథనాల్ కలపాల్సి ఉండగా, కొన్ని చోట్ల ఏకంగా 31 శాతం వరకు కలుపుతున్నారని కర్ణాటక ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేయడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. ఈ వ్యవహారంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేరుగా రంగంలోకి దిగి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించడంతో ఇది పెద్ద రాజకీయ వివాదంగా మారింది. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ20 పెట్రోల్ కాస్తా ఇప్పుడు ‘ఈ420’గా మారిందంటూ రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్ర స్థాయిల్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తాము రాష్ట్రవ్యాప్తంగా బెంగళూరు, కోలార్, చిక్కబళ్లాపుర, రామనగర, మంగళూరు, తుమకూరు తదితర ఏడు జిల్లాల నుంచి 14 పెట్రోల్ నమూనాలను సేకరించి గుర్తింపు పొందిన ప్రయోగశాలలో పరీక్షించామని కర్ణాటక ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి రిజ్వాన్ అర్షద్ వెల్లడించిన వివరాలే ఈ మొత్తం వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. ఆ పరీక్షల్లో 11 నమూనాల్లో 20 శాతానికి మించి ఇథనాల్ ఉందనీ, ముఖ్యంగా ఒక ఇండియన్ ఆయిల్ బంక్ నమూనాలో 31.2 శాతం, ఒక హిందుస్థాన్ పెట్రోలియం బంక్ నమూనాలో 30.5 శాతం ఇథనాల్ ఉన్నట్లు తేలిందని మంత్రి కుండబద్దలు కొట్టారు. అధిక ధర చెల్లించి కొనే ప్రీమియం ఇంధనాల్లో కూడా అచ్చం ఇదే పరిస్థితి ఉందని కర్ణాటక ప్రభుత్వం ఆరోపించడం సామాన్య వాహనదారుల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది.

ఈ పరిణామాలపై స్పందించిన రాహుల్ గాంధీ.. పరిమితికి మించి ఇథనాల్ కలపడం వల్ల వాహనాల ఇంజిన్ల పనితీరు తీవ్రంగా దెబ్బతింటోందని, మైలేజీ పడిపోయి వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కష్టపడి సంపాదించిన డబ్బులిచ్చి కొంటున్న ఇంధనంలో అసలు ఎంత మోతాదులో ఇథనాల్ కలుపుతున్నారో కచ్చితంగా తెలుసుకునే హక్కు ప్రతి వినియోగదారుడికీ ఉందని, ఈ విషయంలో కేంద్రం పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.

అయితే, కర్ణాటక ప్రభుత్వ ఆరోపణలను అటు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు, ఇటు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించాయి. కర్ణాటక ప్రభుత్వం ఏ విధానంలో నమూనాలు సేకరించిందో, వాటిని ఎలా భద్రపరిచి పరీక్షించిందో కనీస స్పష్టత లేదని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తాము సరఫరా చేస్తున్న ఇంధనం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని, అవసరమైతే స్వతంత్ర ప్రయోగశాలల్లో సంయుక్త పరీక్షలకు తాము సిద్ధమని సవాల్ విసిరాయి.

అదే సమయంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సైతం ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. తాము దేశవ్యాప్తంగా 893 నమూనాలను పరీక్షించగా, అందులో కర్ణాటకకు చెందిన 56 నమూనాలు కూడా ఉన్నాయని.. అవన్నీ 19 నుంచి 20 శాతం ఇథనాల్ ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. విదేశాల నుంచి ముడిచమురు దిగుమతుల భారాన్ని తగ్గించి, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడంతో పాటు రైతులకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే కేంద్రం ఈ ఇథనాల్ బ్లెండింగ్ విధానాన్ని అమలు చేస్తోంది.