Mahaa Daily Exclusive

  ‘భారత్ సమ్మిట్’ పేరుతో దేశ ప్రతిష్ఠకు భంగం.

Share

‘భారత్ సమ్మిట్’ పేరుతో దేశ ప్రతిష్ఠకు భంగం.
• ఓట్ చోర్.. సంవిధాన్ చోర్ కాంగ్రెస్ పార్టీయే!
• భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తే సహించేది లేదు.
• బీజేపీ ఆల్ సెల్స్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు.

హైదరాబాద్, మహా.

ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను పదేపదే కాలరాసిన చరిత్ర కాంగ్రెస్‌దేనని, ఇప్పుడు ‘ఓట్ చోర్’, ‘సంవిధాన్ చోర్’ అంటూ బీజేపీపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ‘భారత్ సమ్మిట్’ పేరుతో విదేశీ ప్రతినిధులను ఆహ్వానించి భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేలా చేశారని ఆరోపించారు. జార్జ్ సోరోస్ నిధులతో నడిచే సంస్థలతో సంబంధాలున్న వ్యక్తులకు ఈ వేదిక కల్పించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడం వేరు.. భారతదేశాన్ని అవమానించడం వేరని, దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సెల్స్‌తో పార్టీకి బలోపేతం

నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్‌లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ బీజేపీ అన్ని విభాగాల సమావేశంలో రాంచందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పార్టీ నిర్మాణంలో వివిధ విభాగాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం సెల్స్ పనితీరుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. బీజేపీలో జాతీయ స్థాయిలో 22 అధికారిక సెల్స్ ఉన్నాయని, రాష్ట్ర అవసరాలను బట్టి మరో ఐదారు విభాగాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని వివరించారు. ఎక్స్ సర్వీస్‌మెన్, అడ్వకేట్స్, ట్రేడర్స్, ఐటీ, సోషల్ మీడియా, టీచర్స్, ఎడ్యుకేషన్, డాక్టర్స్, కల్చరల్ తదితర విభాగాలు ఆయా రంగాల నిపుణులను పార్టీతో అనుసంధానం చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఇతర ఆఫీస్ బేరర్లతో సమానంగా సెల్స్ కన్వీనర్లకు కూడా పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని, తాను గతంలో లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్‌గా పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అన్ని విభాగాలు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాంచందర్ రావు ఆదేశించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీఎల్ సంతోష్ సూచనల మేరకు అర్హులైన ఓటర్లను గుర్తించి నమోదు చేయించడంలో సెల్స్ సభ్యులు బాధ్యత తీసుకోవాలని కోరారు. బూత్ స్థాయి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యుద్ధంలో చేతులు, కాళ్లు కోల్పోయిన సైనికుడు సైతం దేశభక్తి గీతాలతో సైన్యంలో ఉత్సాహాన్ని నింపిన ఉదాహరణను ప్రస్తావించారు. ‘సికందర్’ సినిమాలోని ‘డాల్ డాల్ పర్ సోనే కి చిడియా’ గీతం స్ఫూర్తితో కల్చరల్ సెల్ సహా అన్ని విభాగాలు ప్రజల్లో జాతీయవాద చైతన్యాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు.

భారత్ సమ్మిట్‌పై తీవ్ర అభ్యంతరం

హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సమ్మిట్‌పై రాంచందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. పెట్టుబడులు, అభివృద్ధి పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గిగ్ వర్కర్లకు ప్రాతినిధ్యం కనిపించలేదని, కాంగ్రెస్ కార్యకర్తలనే పెద్ద సంఖ్యలో తీసుకొచ్చారని ఆరోపించారు. దేశ అంతర్గత రాజకీయాలపై విదేశీయులు వ్యాఖ్యలు చేయడానికి ఈ వేదికను ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. ఇటలీ నుంచి వచ్చిన ప్రతినిధి ‘ఓట్ చోర్.. గద్దీ చోర్’ అంటూ భారత ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యలు చేయడం దేశ సార్వభౌమాధికారాన్ని అవమానించడమేనని అన్నారు. అమెరికా వంటి దేశాల్లో విదేశీయులు అక్కడి అంతర్గత రాజకీయాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అనుమతిస్తారా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి భారతదేశాన్ని ‘డెడ్ ఎకానమీ’గా అభివర్ణించడమే కాకుండా, ఇప్పుడు విదేశీయులను భారత గడ్డపైకి పిలిపించి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. ‘మీరు మోదీని వ్యతిరేకిస్తే ప్రజాస్వామ్యంలో సహిస్తాం. కానీ భారతదేశాన్ని వ్యతిరేకిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం’ అని స్పష్టం చేశారు.

115 మందే హాజరయ్యారు

భారత్ సమ్మిట్‌కు 350 మంది విదేశీ ప్రతినిధులు రావాల్సి ఉండగా, కేవలం 115 మంది మాత్రమే హాజరయ్యారని రాంచందర్ రావు పేర్కొన్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా వ్యాసాలు రాసిన నార్వే జర్నలిస్టు హెల్లె లింగ్ సహా కొందరి వీసాలను కేంద్ర ప్రభుత్వం చివరి నిమిషంలో రద్దు చేయడాన్ని ఆయన సమర్థించారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి అమెరికా వీసా నిరాకరించాలని 63 మంది కాంగ్రెస్ ఎంపీలు సంతకాలు చేసి అమెరికా అధ్యక్షుడికి లేఖ రాసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఇప్పుడు విదేశీ ప్రతినిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా జాతీయవాద ప్రభుత్వాలను కూల్చివేస్తానని ప్రకటించిన జార్జ్ సోరోస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ నిధులతో నడిచే సంస్థలతో సంబంధాలున్న వ్యక్తులకు భారత్ సమ్మిట్‌లో ప్రాధాన్యత కల్పించారని రాంచందర్ రావు ఆరోపించారు. ప్రోగ్రెసివ్ అలయన్స్, ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ సంస్థల ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ మాజీ అధ్యక్షుడు ప్యాట్రిక్ గాస్పర్డ్, ఈక్వెడార్ మాజీ విదేశాంగ మంత్రి గిలౌమ్ లాంగ్, స్లోవేనియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ 8 మార్చి వ్యవస్థాపకురాలు నికా కోవాచ్, నెదర్లాండ్స్ మాజీ విదేశాంగ మంత్రి బెర్ట్ కోయెండర్స్ పేర్లను ప్రస్తావించారు. వీరికి సోరోస్ నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయని ఆరోపించారు. గతంలో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ అంశంపై భారతదేశ వాదనను వినిపించేందుకు ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్‌పేయిని పంపిన విషయాన్ని రాంచందర్ రావు గుర్తుచేశారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించిన సంప్రదాయాన్ని కాంగ్రెస్ ఇప్పుడు విస్మరిస్తోందని విమర్శించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్‌లు విదేశాల్లో దేశ ప్రతిష్ఠను తగ్గించేలా వ్యవహరించలేదని పేర్కొన్నారు. భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రజాస్వామ్యాన్ని, సార్వభౌమాధికారాన్ని అవమానించేలా వ్యవహరించినందుకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.