‘మా అయ్య బీజేపీ సర్పంచ్… ఏం చేసుకుంటావో చేసుకో’.
* కులం పేరుతో పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.
* దళిత యువతి ఆత్మహత్య.
* 21 పేజీల సూసైడ్ నోట్లో 11 మంది పేర్లు వెల్లడి.
మహబూబాబాద్, మహా.
రెండేళ్ల పాటు ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీరా కులం పేరుతో నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఓ దళిత యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఇచ్చిన మాట ప్రకారం వివాహం చేసుకోవాలని నిలదీసినందుకు ‘మా అయ్య బీజేపీ సర్పంచ్.. ఏం చేసుకుంటావో చేసుకో’ అంటూ ప్రియుడు బెదిరించాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తీవ్ర ఆవేదనకు గురైన సదరు యువతి 21 పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది. తన చావుకు ప్రియుడు అనిల్‌తో పాటు మరో పది మంది కారణమని ఆ లేఖలో పేర్కొనడం సంచలనంగా మారింది.
రెండేళ్ల ప్రేమ.. పెళ్లి ప్రస్తావనతో విభేదాలు.
మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామానికి చెందిన మునిగె సుస్మిత, అదే ప్రాంతానికి చెందిన అనిల్ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని అనిల్ నమ్మించడంతో వీరి బంధం కొనసాగింది. ఈ క్రమంలో గతంలో సుస్మిత గర్భం దాల్చగా, అనిల్ అబార్షన్ చేయించినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొంతకాలం సజావుగా సాగిన వీరి ప్రేమ వ్యవహారంలో ఇటీవల విభేదాలు తలెత్తాయి. పెళ్లి చేసుకోవాలని సుస్మిత గట్టిగా పట్టుబట్టడంతో అనిల్ ముఖం చాటేయడం ప్రారంభించాడు.
కులం అడ్డంకిగా ఉందంటూ బెదిరింపులు.
వివాహం విషయమై సుస్మిత నిలదీయగా, ఆమె దళిత యువతి కావడంతో తమ తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించడం లేదని అనిల్ తేల్చిచెప్పాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తనకు న్యాయం చేయాలని సుస్మిత ప్రాధేయపడగా, రాజకీయ పలుకుబడిని చూపిస్తూ ‘మా అయ్య బీజేపీ సర్పంచ్.. ఏం చేసుకుంటావో చేసుకో’ అంటూ అనిల్ బెదిరింపులకు దిగినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన సుస్మిత ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
21 పేజీల లేఖ.. హత్య ఆరోపణలు.
ఘటనా స్థలంలో సుస్మిత రాసిన 21 పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనకు ఎదురైన వేధింపులు, జరిగిన అవమానాలను అందులో వివరంగా రాసిన ఆమె, తన మృతికి అనిల్‌తో పాటు మరో పది మంది కారణమని పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు, సుస్మితది ఆత్మహత్య కాదని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనిల్, అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని బాధితురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలోనూ సమగ్ర దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మహబూబాబాద్‌లో ధర్నా.. 11 మందిపై కేసు నమోదు.
సుస్మిత మృతికి బాధ్యులైన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు మహబూబాబాద్ అండర్ బ్రిడ్జి వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సుస్మిత తండ్రి ఇచ్చిన ఫిర్యాదు, స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు అనిల్ సహా మొత్తం 11 మందిపై కేసు నమోదు చేశారు. హత్య ఆరోపణలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.








