Mahaa Daily Exclusive

  డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే మోదీ సంకల్పం…

Share

డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే మోదీ సంకల్పం.
• మాదకద్రవ్యాలపై సమరానికి భాగ్యనగరం వేదిక.
* ఈ నెల 25, 26, 27 తేదీల్లో ‘నషా ముక్త్ భారత్’ పేరిట భారీ వాక్.
* యువత భవిష్యత్తును కాపాడుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపు.
హైదరాబాద్, మహా .
దేశ భవిష్యత్తుకు పెను ముప్పుగా పరిణమించిన మాదకద్రవ్యాల మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టి, డ్రగ్స్ రహిత భారత్‌ను నిర్మించడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న మత్తుపదార్థాలపై కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని, ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ సంకల్పానికి మద్దతుగా హైదరాబాద్ నగరంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో ‘నషా ముక్త్ భారత్’ పేరుతో మూడు రోజుల పాటు భారీ అవగాహన నడక నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
యువశక్తిని దెబ్బతీస్తున్న మత్తుమందులు
కింగ్ కోఠిలోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో జైన్ జాగృతి సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాండప్ కామెడీ, కాన్సెప్చువల్ షో కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్ ముందుందని, దేశ ప్రగతిలో యువత పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. అయితే మాదకద్రవ్యాల వినియోగం యువతను పెడదారి పట్టిస్తూ వారి ఆరోగ్యంతో పాటు బంగారు భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ భూతం కేవలం వ్యక్తులకే పరిమితం కాకుండా కుటుంబాలను, సమాజాన్ని, దేశాభివృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తోందని అన్నారు.
ప్రభుత్వ చర్యలతో పాటు సామాజిక ఉద్యమం అవసరం
మాదకద్రవ్యాల ప్రమాదాన్ని గుర్తించిన ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. గతంలో ఆర్టికల్ 370 రద్దు, సర్జికల్ స్ట్రైక్స్ వంటి సాహసోపేత నిర్ణయాలను అమలు చేసిన మోదీ ప్రభుత్వం, ఇప్పుడు దేశం నుంచి డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా అంతమొందించే దిశగా కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. అయితే, ఈ మహమ్మారిపై పోరాటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు కూడా దీనిని ఒక సామాజిక ఉద్యమంగా స్వీకరించాలని సూచించారు.
మూడు రోజుల హైదరాబాద్ వాక్‌ను విజయవంతం చేయాలి
డ్రగ్స్ వ్యతిరేక అవగాహనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకే ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’ పేరిట ప్రత్యేక వాక్ చేపడుతున్నట్లు కేంద్రమంత్రి వివరించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై యువతలో చైతన్యం నింపడం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రజలను ఏకం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, నగర వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ అవగాహన నడకను ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.