కాళేశ్వరానికి ఆదిలోనే హంసపాదు.
* 2020 శాటిలైట్ చిత్రాల్లోనే మేడిగడ్డ డ్యామేజ్ ఆనవాళ్లు!
* పునాది కింద ఇసుక కోత, సాండ్ పైపింగ్‌తో కుంగిన పిల్లర్లు.
* ఎన్డీఎస్ఏ, జ్యుడీషియల్ కమిషన్ నివేదికల్లో సంచలన విషయాలు.
హైదరాబాద్, మహా .
తెలంగాణ సాగునీటి రంగంలో తలమానికంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని బ్యారేజీల భద్రత, నిర్మాణ నాణ్యత అంశాలు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లోని పిల్లర్లు 2023 అక్టోబర్‌లో ఒక్కసారిగా కుంగిపోయాయా? లేక ప్రాజెక్టు ప్రారంభించిన కొద్దికాలం నుంచే లోపల నష్టం మొదలైందా? అన్న ప్రశ్నలకు తాజాగా తెరపైకి వచ్చిన ఉపగ్రహ చిత్రాలు కీలక ఆధారాలను అందిస్తున్నాయి. సీనియర్ ఇంజినీర్, సాగునీటి రంగ నిపుణుడు పి.జి. శాస్త్రి విశ్లేషించిన 2020 నాటి శాటిలైట్ చిత్రాలు మేడిగడ్డ విషాదానికి ముందే ప్రమాద ఘంటికలు మోగాయన్న వాదనకు బలం చేకూరుస్తున్నాయి.
2020 చిత్రాల్లోనే బయటపడ్డ ఇసుక కోత.
కాళేశ్వరం ప్రాజెక్టును 2019 జూన్ 21న అట్టహాసంగా ప్రారంభించారు. ప్రాజెక్టు మొదలైన ఆరు నెలలకే డ్యామేజ్ జరిగిందన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ, సాంకేతిక నివేదికల్లో ప్రస్తావించిన 2020 అక్టోబర్ 30, నవంబర్ 14 తేదీల ఉపగ్రహ చిత్రాలు వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. మేడిగడ్డ ఏడో బ్లాక్ దిగువ భాగంలో భారీగా ఇసుక పేరుకుపోవడం, ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ ఇసుక మేటల విస్తీర్ణం మరింత పెరగడం ఈ చిత్రాల్లో స్పష్టంగా కనిపించింది. 2024 జనవరి 8 నాటి చిత్రంలో అదే చోట నీటి ప్రవాహ ఉధృతికి భారీ గుంత ఏర్పడిన ఆనవాళ్లు నమోదయ్యాయి. 2023 అక్టోబర్‌లో పిల్లర్లు కుంగిపోవడానికి ఎంతో కాలం ముందే బ్యారేజీ దిగువ భాగంలో నీటి ప్రవాహ వేగం వల్ల ఇసుక కొట్టుకుపోవడం, పునాది కింద ఖాళీలు ఏర్పడటం మొదలైందని ఈ చిత్రాలు సూచిస్తున్నాయి.
ఎన్డీఎస్ఏ తనిఖీల్లో వెలుగుచూసిన లోపాలు.
2023 అక్టోబర్ 21న మేడిగడ్డ ఏడో బ్లాక్‌లోని 20వ పిల్లర్‌తో పాటు 16 నుంచి 21 వరకు ఉన్న పిల్లర్లు కుంగిపోయి, నిర్మాణం పగుళ్లు బారి వంగిపోయింది. దీనిపై రంగంలోకి దిగిన కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ) క్షేత్రస్థాయి పరిశీలన జరిపి కీలక నివేదిక ఇచ్చింది. పునాది కింద ఇసుక కొట్టుకుపోవడం, నీటి ఒత్తిడితో పునాదిలోని ఇసుక తరలిపోయే ‘సాండ్ పైపింగ్’ ప్రక్రియ జరగడం, నిర్మాణ నాణ్యత, రూపకల్పన, నిర్వహణలో లోపాల వల్లే పిల్లర్లు కుంగిపోయాయని తేల్చింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ దిగువ భాగంలోని కాంక్రీట్ బ్లాకులు కదిలిపోవడం, రక్షణ నిర్మాణాలు దెబ్బతినడం వంటి సమస్యలను గుర్తించింది. మూడు బ్యారేజీలను ఒకే రకమైన సాంకేతికతతో నిర్మించినందున, మిగిలిన రెండు బ్యారేజీలకూ ఇదే తరహా ముప్పు పొంచి ఉందని ఎన్డీఎస్ఏ తన తుది నివేదికలో హెచ్చరించింది.
జ్యుడీషియల్ కమిషన్ నివేదికలో కీలక అంశాలు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ 2025 జూలై 31న ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో మరిన్ని లోపాలు బట్టబయలయ్యాయి. మేడిగడ్డ నిర్మాణంలో కాంక్రీట్ నాణ్యతను తెలుసుకునేందుకు 37,288 నమూనాలను పరీక్షించాల్సి ఉండగా, కేవలం 7,498 నమూనాలను మాత్రమే పరీక్షించి చేతులు దులుపుకున్నారని కమిషన్ ఎత్తిచూపింది. కేవలం నీటిని మళ్లించేందుకు ఉద్దేశించిన బ్యారేజీలను పూర్తిస్థాయి జలాశయాలుగా మార్చి, ఏడాది పొడవునా నీటిని నిల్వ ఉంచడం వల్ల పునాదులపై విపరీతమైన ఒత్తిడి పడిందని పేర్కొంది. వర్షాకాలానికి ముందు, తర్వాత నిర్వహించాల్సిన కనీస తనిఖీలు, నిర్వహణ నిబంధనలను గాలికొదిలేశారని కమిషన్ ఆక్షేపించింది.
ఊహాగానాలకు చెక్.. నిర్మాణ సంస్థల స్పందన.
మేడిగడ్డ పిల్లర్లు కుంగిన సమయంలో విధ్వంసం కోసం బాంబులు పెట్టారంటూ జరిగిన ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఎన్డీఎస్ఏ, న్యాయ విచారణ నివేదికలు స్పష్టం చేశాయి. ఎక్కడా పేలుడు పదార్థాల ఆనవాళ్లు లేవని, కేవలం ఇంజినీరింగ్, నిర్వహణ లోపాల వల్లే ఈ నష్టం జరిగిందని సాంకేతిక ఆధారాలు రుజువు చేస్తున్నాయి. మరోవైపు, తమపై వచ్చిన ఆరోపణలపై నిర్మాణ సంస్థలు ఎల్అండ్టీ, అఫ్కాన్స్ ప్రభుత్వానికి తమ వాదనలు వినిపించాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించామని ఎల్అండ్టీ పేర్కొనగా, సమగ్ర భూగర్భ పరీక్షలు జరిపి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని అఫ్కాన్స్ సూచించింది. మొత్తానికి 2020 నాటి ఉపగ్రహ చిత్రాలు, సాంకేతిక నివేదికల నేపథ్యంలో మూడు బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు కాకుండా పూర్తిస్థాయి పునరుద్ధరణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నీటిపారుదల రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.








