- వీడియో కాల్ చేసినా వినలేదు
- మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్ హతం
- మసీదులో దాక్కున్నా మట్టుబెట్టిన భద్రతాబలగాలు
- ఎల్ఈటీ ఏకైక స్థానిక ఉగ్రవాది లతీఫ్ భట్
జమ్మూ, మహా : జమ్మూకశ్మీర్‌లో చిట్టచివరి స్థానిక ఉగ్రవాదిగా భావిస్తున్న లష్కరే తయ్యిబ కమాండర్ లతీఫ్ భట్‌ను భద్రతా దళాలు ముట్టుబెట్టాయి. ఇటీవల సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పుల ఘటన తర్వాత అతడి కోసం కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో అతడు మసీదులోకి ప్రవేశించాడని పోలీసులు తెలిపారు. మసీదుకు ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు. ఈ మేరకు కేంద్రమంత్రి అమిత్ షా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ జి.పి. సింగ్, పోలీసులకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.
సోమవారం కుల్గాం జిల్లాలోని లారూ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల సమయంలో లతీఫ్ భట్ బుల్లెట్ గాయాలతో తప్పించుకున్నట్లు సమాచారం. అదే ఆపరేషన్‌లో భద్రతా దళాలు ఉమర్ నాసిర్ దార్ అనే మరో ఉగ్రవాదిని హతమార్చాయి. ఈ ఘటన అనంతరం లతీఫ్ కోసం గాలింపును మరింత విస్తృతం చేశారు. సైన్యం, సీఆర్పీఎఫ్ బలగాలు అతడి కదలికలపై నిఘా పెట్టి, అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. మంగళవారం తెల్లవారుజామున భద్రతా దళాలు లతీఫ్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి చుట్టుముట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా అతడిని లొంగిపోయేలా చేసేందుకు ప్రయత్నించారు. వీడియో కాల్ ద్వారా లతీఫ్‌ను సంప్రదించిన అధికారులు, ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని కోరారు. లొంగిపోతే ఎలాంటి హాని కలగకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే, వారి విజ్ఞప్తిని లతీఫ్ తిరస్కరించారు. చివరకు భద్రతాబలగాలు లతీఫ్‌ను చుట్టుముట్టి హతం చేశాయి.
అమిత్ షా ప్రశంసలు
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా, పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్, నిఘా సంస్థలు సమన్వయంతో చేసిన ఆపరేషన్‌ను ప్రశంసించారు. “లష్కరే తోయిబా చెందిన చివరి క్రియాశీల స్థానిక ఉగ్రవాదిగా భావిస్తున్న లతీఫ్ భట్‌ను ఈరోజు తెల్లవారుజామున కుల్గాంలో జరిగిన ఒక ఆపరేషన్‌లో హతమార్చారు. ఈ మొత్తం ఆపరేషన్ అత్యున్నత స్థాయిలో సమన్వయంతో సాగింది. జేకేపీ, సైన్యం, సీఆర్పీఎఫ్లకు చెందిన ధైర్యవంతులైన జవాన్లకు దేశం వందనం చేస్తోంది” అని ఎక్స్ వేదికగా అభినందించారు. అలాగే భద్రతా దళాలు ఈ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయని డైరెక్టర్ జనరల్ జి.పి. సింగ్ వెల్లడించారు. ఇది 2026లో అతిపెద్ద విజయాల్లో ఒకటి కానుందని ఆయన అన్నారు. “అభినందనలు మిత్రులారా! కొన్ని వంటకాలు చల్లని వాతావరణంలో కూడా చల్లగా తింటేనే బాగుంటాయి” అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
సీఆర్పీఎఫ్ దాడికి ముందు రెక్కీ
ఇదిలా ఉండగా, నవంబర్ 11న కుల్గాంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడి జరగడానికి ముందు లతీఫ్ భట్ పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా వెల్లడైనట్లు సమాచారం. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ దృశ్యాల్లో నవంబర్ 10న అతడు మీర్ బజార్, అఖ్రాన్ హబ్లిష్, కిలామ్ ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు కనిపించినట్లు అధికారులు గుర్తించారు. దాడికి ముందు ఆయా ప్రాంతాల్లో అతడి కదలికలు నమోదైనట్లు తెలుస్తోంది. లతీఫ్ భట్ గతంలో పలు కీలక ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నట్లు భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. అతడి ఆచూకీ తెలిపి పట్టుకోవడంలో సహకరించిన వారికి రూ.15 లక్షల నజరానా ప్రకటించినట్లు సమాచారం. దీంతో అతడిని పట్టుకునేందుకు భద్రతా సంస్థలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి.
జలంగం పహ్లూలో మళ్లీ ఎదురుకాల్పులు
ఇదిలా ఉండగా, కుల్గాంలోని జలంగం పహ్లూ ప్రాంతంలో బుధవారం మరోసారి భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య సాయుధ ఘర్షణ చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో భద్రతా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయి. గాలింపు సమయంలో ఉగ్రవాదులతో సంపర్కం ఏర్పడటంతో కాల్పులు మొదలైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనను కశ్మీర్ జోన్ పోలీసులు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ధ్రువీకరించారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలతో కూడిన సంయుక్త బృందానికి ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. ఘర్షణకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
నవంబర్ 16న లారూలో ఎదురుకాల్పులు
కుల్గాంలోని లారూ ప్రాంతంలో నవంబర్ 16న కూడా భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది మృతదేహంతో పాటు ఒక ఆయుధాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించి, మరికొందరు ఉగ్రవాదులు అక్కడ దాగి ఉన్నారా అనే కోణంలో గాలింపు చేపట్టాయి. అదనపు భద్రతా సిబ్బందిని కూడా అక్కడ మోహరించాయి. ఉగ్రవాదుల కదలికలను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాయి. విశ్వసనీయ సమాచారం ఆధారంగానే లారూ ప్రాంతంలో ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.







