- ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం
- తిరుమల నుంచి వస్తుండగా డీసీఎంను ఢీకొట్టిన కారు
- స్వల్ప గాయాలతో బయటపడ్డ వెంకట్ దంపతులు
హైదరాబాద్, మహా : కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు కోళ్ల లోడ్‌తో వెళ్తున్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులో ఉన్న బల్మూరి వెంకట్, ఆయన భార్య ఇందుజా స్వల్ప గాయాలతో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా.. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొత్తూరు బైపాస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కోళ్ల లోడ్‌తో వెళ్తున్న లారీని ఒక్కసారిగా ఎమ్మెల్సీ కారు వెనుక నుంచి ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.
అయితే ఈ ప్రమాదానికి కారు డ్రైవర్ నిర్లక్ష్యమా? అతివేగమే కారణమా? లేక మరేదైనా ఇతర కారణాలతో ప్రమాదం జరిగిందా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా.. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. ప్రమాద సమయంలో కారులో బల్మూరి వెంకట్ దంపతులతోపాటు ఆయన సోదరుడు చాణక్య, డ్రైవర్ శ్రీకాంత్ ఉన్నారు. వారు కూడా స్వల్పగాయాలతో బయటపడ్డారు. వెంకట్ కారు ప్రమాదానికి గురైందన్న సమాచారం తెలియడంతో ఆయన అనుచరులు, రాజకీయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే ఆయన, ఆయన భార్య స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.








