Mahaa Daily Exclusive

  టాలీవుడ్‌లో కలకలం…..

Share

  • టాలీవుడ్‌లో కలకలం
  • బడా నిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష
  • చెక్ బౌన్స్ కేసులో శిక్ష ఖరారు చేసిన ఒంగోలు కోర్టు

ఒంగోలు, మహా : టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత అగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన బండ్ల గణేశ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించిన ఈ బడా నిర్మాత ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఒంగోలు న్యాయస్థానం ఏకంగా ఏడాది పాటు జైలు శిక్ష విధించడం సినీ ఇండస్ట్రీలో తీవ్ర సంచలనంగా మారింది. జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధిస్తూ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది.

ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు ప్రాంతానికి చెందిన జెట్టి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి బండ్ల గణేశ్ గతంలో భారీ మొత్తంలో బాకీ పడ్డాడు. ఆయనకు చెల్లించాల్సిన రూ.95 లక్షల కోసం తన సొంత నిర్మాణ సంస్థ ‘పరమేశ్వర ఆర్ట్స్’ పేరు మీద ఒక చెక్ రాసి ఇచ్చాడు. ఆ చెక్‌ను తీసుకున్న బాధితుడు బ్యాంకులో వేయగా, ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో అది బౌన్స్ అయింది. డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో సరైన స్పందన రాకపోవడంతో, మోసపోయానని గ్రహించిన బాధితుడు తనకు న్యాయం చేయాలంటూ నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ వ్యవహారంపై గత కొంతకాలంగా ఒంగోలు కోర్టులో విచారణ సాగుతోంది. ఇరువర్గాల వాదనలు నిశితంగా విన్న న్యాయమూర్తి, చెక్ బౌన్స్ అయిన మాట వాస్తవమేనని నిర్ధారించారు. ఆధారాలన్నీ బండ్ల గణేశ్‌కు వ్యతిరేకంగా ఉండటంతో కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఈ మేరకు ఆయనకు ఏడాది పాటు సాధారణ జైలు శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. శిక్షతో పాటు బాధితుడి దగ్గర తీసుకున్న అప్పు కింద రూ.95 లక్షల భారీ జరిమానాను సైతం వెంటనే చెల్లించాల్సిందిగా న్యాయస్థానం తన తీర్పులో స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది.

బండ్ల గణేశ్ కోర్టు కేసుల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలు ఆర్థిక లావాదేవీల వ్యవహారాల్లో ఆయనపై ఇలాంటి వివాదాలే నెలకొన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మెస్సర్స్ శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ కోసం యూనియన్ బ్యాంక్ నుంచి ఆయన భారీగా రుణాలు తీసుకున్నారు. ఇందుకు గానూ ఆయన కుటుంబ సభ్యులకు చెందిన సొంత ఆస్తులను పూచీకత్తుగా పెట్టారు. అయితే ఆ సంస్థ దివాలా తీయడంతో, అప్పుల కింద ఆయన తనఖా పెట్టిన ఆ ఆస్తిని బ్యాంక్‌ అధికారులు చట్టప్రకారం బహిరంగ వేలం వేశారు. బ్యాంకు తీసుకున్న ఈ వేలం నిర్ణయాన్ని సవాలు చేస్తూ బండ్ల గణేశ్ వెంటనే రుణ వసూళ్ల ట్రైబ్యునల్‌ (డీఆర్‌టీ)ని ఆశ్రయించారు. అక్కడ ఆయనకు అనుకూలంగా వేలం రద్దు ఉత్తర్వులు రాగా, ఆ తీర్పును సవాలు చేస్తూ యూనియన్‌ బ్యాంక్‌ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు.. బ్యాంకు వేలం వేయడాన్ని పూర్తిగా సమర్థిస్తూ డీఆర్‌టీ ఆదేశాలను కొట్టివేసింది. దీంతో ఏకంగా సుప్రీంకోర్టు తలుపులు తట్టిన ఈ బడా నిర్మాతకు అక్కడ కూడా తీవ్ర చుక్కెదురైంది. ఈ వ్యవహారంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం సైతం తేల్చిచెప్పడంతో ఆయనకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.