Mahaa Daily Exclusive

  ఐటీ కంపెనీల పనివేళలు మార్చాల్సిందే..!  ‘సైబరాబాద్ మూవ్స్ ఇన్ 2026’ సదస్సులో డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు.

Share

  •  ఒకే సమయంలో కార్యాలయాల ప్రారంభంతో విపరీతమైన రద్దీ.
  •  ఐటీ ఉద్యోగులకు ప్రత్యేక క్యారేజ్ వేలు, కౌంటర్ ఫ్లో బస్ లేన్ల ఏర్పాటుకు ప్రతిపాదన.
  •  ‘సైబరాబాద్ మూవ్స్ ఇన్ 2026’ సదస్సులో డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు.

హైదరాబాద్, మహా:

హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ఐటీ కంపెనీల పనివేళల్లో మార్పులు తీసుకురావడం అత్యవసరమని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. అన్ని కార్యాలయాలు ఒకే సమయంలో ప్రారంభమై, ఒకే సమయంలో ముగుస్తుండటంతో రహదారులపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోతోందని ఆయన పేర్కొన్నారు. సైబరాబాద్ పరిధిలో చిన్న భౌగోళిక విస్తీర్ణంలోనే ఐటీ సంస్థలు, భారీ నివాస సముదాయాలు కేంద్రీకృతం కావడంతో రాకపోకలు తీవ్ర ఇబ్బందికరంగా మారుతున్నాయని వివరించారు. గురువారం టీ-హబ్‌లో నిర్వహించిన ‘సైబరాబాద్ మూవ్స్ ఇన్ 2026’ సదస్సులో పాల్గొన్న డీజీపీ, ట్రాఫిక్ నియంత్రణకు అనుసరించాల్సిన వ్యూహాలపై పలు కీలక సూచనలు చేశారు.

అంతర్గత వీధుల అనుసంధానం.. రహదారుల పునర్నిర్మాణం.

సైబరాబాద్ ప్రాంతంలో ప్రధాన రహదారులతో పాటు అంతర్గత వీధుల అనుసంధానం సక్రమంగా లేకపోవడం ట్రాఫిక్ జామ్‌లకు ప్రధాన కారణమవుతోందని సీవీ ఆనంద్ అభిప్రాయపడ్డారు. కొద్దిపాటి వర్షం కురిసినా వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోయే పరిస్థితి నెలకొందన్నారు. జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్క్ పరిసరాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న తరహాలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వన్‌వే లూప్‌లు, ఫ్రీ లెఫ్ట్‌లు, యూటర్న్‌లను శాస్త్రీయంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ ప్రవాహానికి అనుగుణంగా రహదారుల రూపకల్పనలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రత్యేక క్యారేజ్ వేలు.. విమర్శలకు వెరవని నిర్ణయాలు.

ఐటీ ఉద్యోగుల రాకపోకలను సులభతరం చేసేందుకు ప్రత్యేక క్యారేజ్ వేలు, కౌంటర్ ఫ్లో బస్ లేన్ల వంటి వినూత్న ప్రయోగాలను చేపట్టాలని డీజీపీ ప్రతిపాదించారు. ట్రాఫిక్ నిబంధనల్లో మార్పులు చేసినప్పుడు తొలి రెండు, మూడు రోజులు విమర్శలు రావడం సహజమని, వాటికి భయపడకుండా ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే నిర్ణయాలను పోలీసు అధికారులు ధైర్యంగా అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. మియాపూర్ ప్రాంతంలో రహదారుల వెడల్పును పెంచడంతో పాటు, ఐటీ కంపెనీల భాగస్వామ్యంతో ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆయన సూచించారు.

10 లక్షల మంది ఉద్యోగుల్లో చైతన్యం.. ప్రజా రవాణాకు పెద్దపీట.

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో సుమారు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులకు ప్రజా రవాణా వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని డీజీపీ పిలుపునిచ్చారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులను ఆశ్రయించేలా ఉద్యోగులను ప్రోత్సహించగలిగితే రహదారులపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందన్నారు.
సైబరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలను శాశ్వతంగా అధిగమించేందుకు మెట్రో రైలు విస్తరణ, ఎంఎంటీఎస్ సేవల మెరుగుదల, ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచడం ఎంతో కీలకమని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. వినూత్న ఆలోచనలకు వేదికగా నిలిచిన టీ-హబ్‌లో ఈ సదస్సు నిర్వహించడం అభినందనీయమన్న ఆయన, ప్రభుత్వ శాఖలు, ఐటీ సంస్థలు, పౌరులు సమన్వయంతో పనిచేస్తే సైబరాబాద్‌ను ట్రాఫిక్ రహిత, సుందర ప్రాంతంగా తీర్చిదిద్దవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest