- పోచమ్మ మైదాన్ జంక్షన్ లో రోడ్లు అస్తవ్యస్తం
- అడ్డగోలుగా రోడ్డు తవ్వకాలు.. డ్రైనేజీ మరమ్మత్తులతో జంక్షన్ కంపు
- తరచూ మంచినీటి పైప్లైన్ లీకేజీలతో రోడ్ల పై గుంతలు
- నరకం చూస్తున్న నగర ప్రజలు, వాహనదారులు
- పట్టించుకోని సంబంధిత శాఖలు, బల్దియా అధికారులు
- కలెక్టర్ మేడం జర చూడండి జంక్షన్ పరిస్థితి
వరంగల్, బ్యూరో మహా ;
వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ ప్రస్తుతం స్మార్ట్ సిటీకి అద్దం పడుతోంది. కానీ ఆ అద్దంలో కనిపిస్తున్నది అభివృద్ధి కాదు – రోడ్లు అస్తవ్యస్తం, గుంతలు, డ్రైనేజీ కంపు, జంక్షన్ కాస్త నరక ప్రాయంగా మారిందని ప్రజలు మండిపడుతున్నారు.
మహా పత్రికా బృందం రాత్రి జంక్షన్ వద్దకు వెళ్లి తీసిన లైవ్ ఫోటోలే ఈ దుస్థితికి ప్రత్యక్ష సాక్ష్యాలు.
అడ్డగోలుగా రోడ్లు తవ్వారు, పూడ్చ లేదని
ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. జంక్షన్ లో పెద్ద పెద్ద బండరాళ్లు, మట్టి కుప్పలు రోడ్డు మీదే పడి ఉన్నాయి. చుట్టూ పోలీస్ బారికేడ్లు పెట్టారు కానీ, తవ్విన గుంతను పూడ్చే దిక్కు లేదు. నెట్వర్క్స్, గ్యాస్ పైపు లైన్, మంచి నీటి పైప్ లైన్ల లీకేజీలు ఏ కారణమైతే నేమి తరచూ ఏదో ఒక అంశం పై రోడ్ల ను తవ్వుతున్నారు. తవ్వడం తప్ప పూడ్చడం అనే మాటే లేదు. దీంతో జంక్షన్ సగం రోడ్డు పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది.
*రోజుల తరబడి డ్రైనేజీ మరమ్మత్తులు*
జంక్షన్ లో శ్రీ శివసాయి మందిర్ గుడి దగ్గర మరీ దారుణం. ఓవైపు డ్రైనేజీ మరమ్మత్తులు దాని కంపు మరోవైపు ట్రాఫిక్ జామ్ లతో రోజు స్థానికులు, వాహనదారులు నరకం చూస్తున్నారు. డ్రైనేజీని తవ్వి, మురుగు కాలువను అలాగే తెరిచి ఉంచారు. అందులో నల్లటి మురుగు నీరు, చెత్త, ప్లాస్టిక్ కవర్లు తేలుతున్నాయి. ఆ కంపు జంక్షన్ మొత్తం వ్యాపిస్తోంది.
ఆ తెరిచిన డ్రైనేజీ పక్కనుంచే వాహనాలు, పాదచారులు వెళ్తున్నారు. రాత్రి వేళ చీకట్లో ఎవరైనా కాలు జారి ఆ మురుగు గుంతలో పడి ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటి? అధికారులు ఆలోచిస్తున్నారా?
*తరచూ మంచినీటి పైప్లైన్ లీకేజీల తో గుంతలు*
పోచమ్మ మైదాన్ జంక్షన్, దేశాయ్ పేట్ రోడ్డు లో ఇదే పెద్ద సమస్య తరచూ మంచినీటి పైప్లైన్ లీకేజీలు అవుతున్నాయి. లీక్ అయిన ప్రతిసారీ రోడ్డు తవ్వుతారు, పైప్ బాగు చేస్తారు, అలాగే వదిలేస్తారు. కాంట్రాక్టులకు కాసుల పండుగ.
లీకేజీ నీటితో రోడ్డు తడిసి, తారు లేచిపోయి గుంతలు పడుతున్నాయి. రోడ్డు మధ్యలోనే పెద్ద గుంత – తారు ఊడిపోయి, గులకరాళ్లు బయటపడ్డాయి. ఇది లీకేజీల వల్లే ఏర్పడిన గుంత అని స్థానికులు చెబుతున్నారు.
*నెలల తరబడి నరకం -ప్రజలు, వాహనదారుల ఆవేదన*
ఇది ఒక రోజు సమస్య కాదు, నెలల తరబడి ప్రజలు అనుభవిస్తున్న నరకం. ఒకవైపు ఆటో లతో జంక్షన్ జామ్ మరోవైపు ఉదయం స్కూల్, ఆఫీస్ వేళ, సాయంత్రం పీక్ అవర్స్ లో జంక్షన్ లో ట్రాఫిక్ జామ్ లో బైక్ లు, ఆటోలు, కార్లు, బస్సులు అన్నీ ఒకే చోట ఇరుక్కు పోతున్నాయి.
బైక్ వాళ్లు గుంతలు తప్పించుకుంటూ, రాళ్ల మీద నుంచి వెళ్తున్నారు. ఆటో వాళ్లు ప్రయాణికులను ఎక్కించుకోలేకపోతున్నారు. వ్యాపారులు మా షాపుల ముందు బురద, కంపు, దుమ్ము – కస్టమర్లు రావడం లేదు అని వాపోతున్నారు.
*పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు, బల్దియా*
ఆర్ అండ్ బి అంటే బల్దియా, బల్దియా అంటే వాటర్ వర్క్స్, వాటర్ వర్క్స్ అంటే ఆర్ అండ్ బి – ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్నారు. ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదు.
ఫిర్యాదు చేస్తే “టెండర్ అయింది, పని జరుగుతోంది” అని కొన్ని నెలలుగా ఇదే విషయాన్ని చెబుతున్నారు. కానీ గ్రౌండ్ లో పని ఎక్కడ జరుగుతోందో కనిపించడం లేదు.
*కలెక్టర్ మేడం జర చూడండి.. ప్రజల విజ్ఞప్తి*
ఇప్పుడు ప్రజలందరూ ఒక్కటే కోరుతున్నారు – వరంగల్ కలెక్టర్ మేడం జర చూడండి ఈ రోడ్ల పరిస్థితి.
సంబంధిత శాఖలు పట్టించుకోవడం లేదు కాబట్టి, జిల్లా కలెక్టర్ గారే నేరుగా వచ్చి పోచమ్మ మైదాన్ జంక్షన్ ను ఒక్కసారి చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకేసారి ఆర్ అండ్ బి, బల్దియా, వాటర్ వర్క్స్ అధికారులను పిలిచి, శాశ్వత పరిష్కారం చూపించాలని
స్మార్ట్ సిటీ నిధులు ఎక్కడికి పోతున్నాయి? ఈ జంక్షన్ కు ఎందుకు ఖర్చు చేయడం లేదు? ఒకవేళ చేసిన అభివృద్ధి ఎక్కడ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.








