Mahaa Daily Exclusive

  ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులా..? కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ – నాగరాజు గుర్రాల, బీఆర్ఎస్ ఎన్నారై నాయకుడు దక్షిణాఫ్రికా..

Share

జోహన్నెస్‌బర్గ్, దక్షిణాఫ్రికా: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష గొంతులను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఎన్నారై నాయకుడు, దక్షిణాఫ్రికాకు చెందిన నాగరాజు గుర్రాల తీవ్రంగా విమర్శించారు. ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులకు దిగడం కాంగ్రెస్ ప్రభుత్వ అసహనానికి, నిరంకుశ ధోరణికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.

రాజ్యాంగ దినోత్సవం రోజునే తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కలిగించే ఘటన చోటుచేసుకోవడం అత్యంత దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను, నిరసన తెలిపే హక్కును గౌరవించాల్సిన ప్రభుత్వం, ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ బావర్చి హోటల్‌లో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహించిన కార్యక్రమంపై కాంగ్రెస్ నాయకులు, అనుచరులు దాడికి పాల్పడిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు.

ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ అమలుపై ప్రశ్నిస్తూ ఆయన చిత్రపటంతో డిన్నర్ కార్యక్రమం నిర్వహించడం తప్పెలా అవుతుందని నాగరాజు ప్రశ్నించారు. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ఎన్నికల హామీల అమలుపై నిలదీయడం ప్రతిపక్షాల ప్రజాస్వామ్య హక్కు అని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా? ఉద్యోగాలపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం, ప్రశ్నించిన వారిపై దాడులకు దిగడం ఏమిటని ఆయన నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక, నిరసన కార్యక్రమాలను భౌతిక దాడులతో అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసహనానికి పరాకాష్ట అని విమర్శించారు.

ఈ ఘటనలో స్వయంగా ఒక రాజ్యసభ సభ్యుడే దాడికి నాయకత్వం వహించి తన అనుచరులతో దాడులు చేయించారనే ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత కలిగి ఉంటారని, అలాంటి వారిపైనే దాడులకు నాయకత్వం వహించారనే ఆరోపణలు రావడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని పేర్కొన్నారు.

శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న బీఆర్ఎస్ యువ నాయకులు మన్నె క్రిశాంక్, ముఠా జైసింహ, జగన్ పాటిమీది, దినేశ్ చౌదరి, విష్ణువర్ధన్ రెడ్డి, హరీశ్ రెడ్డిలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని నాగరాజు గుర్రాల డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారితో పాటు, దాడికి ప్రోత్సహించిన లేదా నాయకత్వం వహించిన వారిపై కూడా చట్టప్రకారం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కులకు, నిరుద్యోగుల గొంతుకకు, ప్రతిపక్షాల నిరసన స్వేచ్ఛకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారికి దక్షిణాఫ్రికా బీఆర్ఎస్ ఎన్నారై విభాగం తరఫున సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

“ఉద్యోగాలు అడగడం నేరం కాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పు కాదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును భౌతిక దాడులతో అణచివేయలేరు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే” అని నాగరాజు గుర్రాల స్పష్టం చేశారు.

నాగరాజు గుర్రాల
బీఆర్ఎస్ ఎన్నారై నాయకుడు
దక్షిణాఫ్రికా

Latest