Mahaa Daily Exclusive

  హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో డిసెంబర్ 1 నుంచి 6 వరకు బ్రహ్మోత్సవాలు..

Share

  • హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో
    డిసెంబర్ 1 నుంచి 6 వరకు బ్రహ్మోత్సవాలు
  • ఆరు రోజుల పాటు వైభవంగా ఎనిమిదో వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు
  • డిసెంబర్ 4న స్వామివారి కల్యాణోత్సవం.. 6న 108 కలశాల మహా చూర్ణాభిషేకం

హైదరాబాద్, మహా: ఆధ్యాత్మిక శోభతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ముస్తాబవుతోంది. ఆలయంలో ఎనిమిదో వార్షిక బ్రహ్మోత్సవాలను డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ఆరు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, శ్రీశ్రీ రాధాగోవిందుల దివ్య సన్నిధిలో జరగనున్న ఈ ఉత్సవాలకు తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. 2018లో ప్రారంభమైన ఈ ఆలయంలో స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, శ్రీశ్రీ రాధాగోవిందులు ప్రధాన దైవాలుగా కొలువై ఉన్నారు. పాంచజన్యేశ్వర స్వామి, శ్రీ జప ఆంజనేయ స్వామి తదితర పరివార దేవతామూర్తులు కూడా భక్తులకు దర్శనమిస్తున్నారు.

ఆరు రోజుల పాటు విశేష పూజలు

డిసెంబర్ 1న స్వామివారి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు పవిత్ర అభిషేకంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 2న ధ్వజారోహణం, ఊంజల సేవ, 3న హనుమద్వాహన సేవ నిర్వహిస్తారు. డిసెంబర్ 4న శ్రీభూసమేత నరసింహ స్వామివారి కల్యాణోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. డిసెంబర్ 5న మహా సుదర్శన హోమం, గరుడ వాహన సేవ, శ్రీశ్రీ రాధాగోవిందుల ఝూలన్ ఉత్సవం నిర్వహించనున్నారు. చివరి రోజైన డిసెంబర్ 6న మహా పూర్ణాహుతి, చక్రస్నానం, 108 కలశాల మహా చూర్ణాభిషేకం, మహా సంప్రోక్షణ, శ్రీ పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

భక్తులకు ప్రత్యేక ఆహ్వానం

ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రతిరోజూ విశేష అలంకరణలు, పుష్పాలంకరణలు, నూతన వస్త్రాలు, ప్రత్యేక ఆభరణాలతో సేవలు నిర్వహించనున్నారు. భక్తి సంకీర్తనలు, వేద సంప్రదాయ క్రతువులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకోనుంది.
హరే కృష్ణ మూవ్‌మెంట్ – హైదరాబాద్ అధ్యక్షులు త్రిదండి సన్యాసి పూజ్య శ్రీమాన్ సత్య గౌర చంద్ర స్వామీజీ మహారాజ్ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పోస్టర్‌ను, కార్యక్రమ వివరాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోని తొలి గోల్డెన్ టెంపుల్‌గా గుర్తింపు పొందిన ఈ క్షేత్రంలో ఎనిమిదో వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనందకరమని తెలిపారు. ప్రాచీన ఆధ్యాత్మిక సంప్రదాయాలను కొనసాగిస్తూ, పూజలు, కీర్తనలు, భక్తిసేవల ద్వారా భగవంతుడిని ఆరాధించే ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు.

Latest