Mahaa Daily Exclusive

  అల్లు అభిమానుల నుంచి మాకు ప్రాణహాని చంపేస్తామంటూ వందల కాల్స్ ఓయూ విద్యార్థి జేఏసీ నేతల ఫిర్యాదు

Share

హీరో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్​ నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటూ ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు ఓయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంటిపై దాడి చేసినందుకు వెంటనే హీరో అల్లు అర్జున్‌కు క్షమాపణ చెప్పాలని అల్లు అర్మీ, అల్లు అర్జున్‌ అభిమానుల పేరుతో వందల కాల్స్‌ వస్తున్నాయని జేఏసీ నేతలు ఆరోపించారు. చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్‌ అభిమానుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఫోన్​ నంబర్లను అల్లు అర్జున్​ ఫ్యాన్స్​ సోషల్​ మీడియాలో పెట్టి వైరల్​ చేస్తున్నారని ఓయూ జేఏసీ నేతలు తమ ఫిర్యాదులో తెలిపారు. తమకు ఫోన్​ కాల్స్​ రాకుండా చేయాల్సిన బాధ్యత అల్లు అర్జున్​దేనన్నారు. ఫోన్​ కాల్స్​ ఆగకపోతే వేలాది మందితో అర్జున్​ ఇంటిని ముట్టడిస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. పోన్​ చేసి బెదిరిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

డిసెంబర్ 4 వ తేదీన సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి మరణానికి అల్లు అర్జున్‌ కారణమంటూ ఇటీవల ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు అర్జున్​ ఇంటివద్ద ఆందోళనకు దిగారు. రేవతి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ అల్లు అర్జున్‌ నివాసంపై రాళ్లను విసిరారు. ఆయన ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ఓయూ జేఏసీ నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాళ్లు తగిలి అల్లు అర్జున్‌ ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. ఘటనకు కారకులైన వారిని అరెస్టు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా బెయిల్ పై బయటకు వచ్చారు.

Latest