Mahaa Daily Exclusive

  సర్కారు పనితీరు బాగుంది ప్రజలకు ఇంకా దగ్గర కావాలి….!

Share

ఒక్క ఏడాది రైతులకు రూ.54వేల కోట్ల చెల్లింపు సాహసం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రులను అభినందించిన కేసీ వేణుగోపాల్

క్షేత్రస్థాయిలో పదవుల భర్తీచేసి జోష్ నింపండి

నెలాఖరులోగా మండల, పట్టణ స్థాయి పదవులు భర్తీ చేయండి

కార్యకర్తల్లో జోష్ వచ్చేలా నియామకాలు చేపట్టండి

అంబేద్కర్ విషయంలో అమిత్ షా వ్యాఖ్యలను ఎండగట్టండి

నేతలకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచన

నెలకోసారి జిల్లాల్లో మంత్రుల ప్రజాదర్బార్ .. పిఏసిలో నిర్ణయం

త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాం- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సీఎం పిలుపు

ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేరుస్తోంది- పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ వెన్నముక.. త్వరలో పదవుల పండుగ- పిఏసి ఛైర్మన్ శ్రీధర్ బాబు

ఈనెలలో హైదరాబాద్ కు రాహుల్ , ఖర్గే

హైదరాబాద్, మహా
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తున్న తీరు అభినందనీయమని, ఒక్క ఏడాదిలో రైతాంగానికి రూ.54వేల కోట్ల సాయం చేయడం గొప్ప విషయమని ఎఐసిసి ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రులను అభినందించారు. బుధవారం సాయంత్రం గాంధీభవన్ లో ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దీపాదాస్ మున్షీ అధ్యక్షతన జరిగిన పిఏసి సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తోపాటు ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పనితీరును , ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తాజాగా మన్మోహన్ సింగ్ మృతి కి సంతాపంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటుచేసి మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీ లో తీర్మానం చేసిన విషయం చెప్పారు. పాతబస్తీలో కొత్త నిర్మించిన ఫ్లైఓవర్ కి మన్మోహన్ సింగ్ పేరు పెట్టామని, జనవరి 26 రైతు భరోసా ఇస్తున్నామని, రైతు కూలీలకు యేడాది 12 వేలు అందిస్తున్నామన్నారు. ఒక్క ఏడాదిలో రైతాంగానికి రూ.54వేల కోట్లు అందజేసిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. కొత్త రేషన్ కార్డ్ లు ఇవ్వబోతున్నామని, ఏడాది లో 55143 ఉద్యోగాలు ఇచ్చామని, రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రూ.500 కే సిలిండర్ ఇస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 4000 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీ కి చెల్లించిందన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పనితీరు బాగుందని, ఎన్నో భారీ కార్యక్రమాలు విజయవంతంగా అమలుచేశారని కేసీ వేణుగోపాల్ ప్రశంసించారు.

బిజెపి విధానాలపై కఠినంగా వ్యవహరించాలి

బిజెపి విధానాలపై కఠినంగా వ్యవహరించాలని, రాబోయే నాలుగేళ్ళు క్షేత్రస్థాయి నుండి పార్టీ బలోపేతానికి కార్యాచరణ తీసుకోవాలని కేసీ వేణగోపాల్ ఈ సందర్భంగా నేతలకు సూచించారు. రాజ్యాంగాన్ని, డాక్టర్ అంబేద్కర్ ను అగౌరవపరుస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా దారుణంగా వ్యవహరిస్తున్నారని, వీటిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు కమిటీలు కిందివరకు పూర్తిచేయాలని, పార్టీకి ప్రభుత్వానికి మధ్య పూర్తి సమన్వయం ఉండాలని, మండల, పట్టణ కమిటీలు ఏర్పాటుచేసుకుని ముందుకు నడవాలన్నారు. వివిధ ఆర్గనైజేషన్స్ కు సంబంధించి, కార్పోరేషన్ నియామకాలను కూడా త్వరితగతిన చేపట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయి, నియోజకవర్గ , జిల్లా స్థాయి నాయకులకు.. వివిధ హోదాల్లో స్థానం కల్పించాలని, అతి త్వరలో రాష్ట్రంలో వివిధ కార్పోరేషన్స్, నియామకాలు కూడా పూర్తిచేయాలని సూచించారు.

కార్యకర్తలే వెన్నముక

కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నముక అని, కార్యకర్తలకు మార్కెట్ కమిటీల నియామకాలు జరుగుతున్నాయని, దేవాదాయ శాఖకు సంబంధించిన కమిటీలు జరుగుతున్నాయని పిఏసి ఛైర్మన్, మంత్రి శ్రీధర్ బాబు సమావేశ అనంతరం మీడియాకు వివరించారు. క్షేత్రస్థాయి కమిటీల నిర్మాణం వీలైనంత త్వరగా జరుగుతుందన్నారు. అందరికీ రావాలనే ఆశ తప్పు కాదని, కానీ పదవులు పార్టీ అవసరాల రీత్యా భర్తీచేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ అని, ప్రభుత్వ కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్నారు.

హైదరాబాద్ కు రాహుల్, ఖర్గే
ఈ నెలలో సంవిదాన్ బచావో ర్యాలీ ఉంటుందని, ర్యాలీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొంటారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. రెండున్నరగంటల పాటు సమావేశం జరిగిందని, ప్రభుత్వం ప్రజలకు ఇంకా దగ్గర కావాలని కేసీ సూచించారన్నారు. నెలలో ఒక సారి పిఏసి మీటింగ్ సమావేశం జరగాలని కేసి సూచించారని, కొత్త కమిటీ ఏర్పడే వరకు పాతకమిటీనే ఉంటుందన్నారు. నెలలో ఒక సారి మంత్రి జిల్లా లో ప్రజా దర్బార్ నిర్వహించాలని కేసీ సూచించారని తెలిపారు. సమావేశంలో ఉత్తమ్, మధుయాష్కీ గౌడ్, వీహెచ్, మంత్రులు తదితరులు పాల్గొన్నారు

Latest