మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్. ఇక నుంచి తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల అమ్మకాలు బంద్ కానున్నాయి.బీర్ల తయారీ కంపెనీ తీసుకున్న నిర్ణయమే ఇందుకు ఖారణం. తెలంగాణకు తమ బీర్లను సప్లయ్ చేయబోమంటూ యునైటెడ్ బ్రేవరేస్ లిమిటెడ్ తేల్చి చెప్పింది. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. బీర్ల ధరలను సవరించకపోవడంతో పాటు పాత బకాయిలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంతో.. తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల సరఫరా ఇక నుంచి నిలిచిపోనుంది.
సెబీ లిస్టింగ్ రెగ్యులేషన్స్లోని రెగ్యులేషన్ 30 ప్రకారం తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కి తమ బీర్ సరఫరాను తక్షణమే నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రేవరేస్ లిమిటెడ్ తన లేఖలో పేర్కొంది. టీజీబీసీఎల్ బీర్ల ప్రాథమిక ధరను 2019 నుంచి ఇప్పటి వరకు సవరించలేదని, దీని కారణంగా రాష్ట్రంలో భారీగా నష్టాలు వస్తున్నాయని పేర్కొంది. అలాగే బీర్ల సరఫరాకు సంబంధించి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ చాలా బకాయి పడిందని, ఆ బిల్లులు చెల్లించకపోవడంతో కంపెనీ తీవ్రంగా నష్టపోతుందన్నారు. ఈ కారణంగా టీజీబీసీఎల్కి బీర్లను సరఫరా చేయడం సాధ్యం కాదని, ఇక నుంచి బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యూబీఎల్ తన లేఖలో స్పష్టం చేసింది. తమ సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని యూబీఎల్ విజ్ఞప్తి చేసింది. అయితే ప్రభుత్వం ఎంత బకాయి ఉంది. 2019 లో నిర్ణయిచిన ధర ఎంత, ఇప్పుడు కంపనీ ఎంత మేర ధర పెంచాలని ప్రభుత్వాన్ని కోరిందన్న వివరాలేవీ లేఖలో పేర్కొనక పోవడం కొసమెరుపు.








