విజయవాడ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండుగ కోసం ప్రజలు ఊరేళ్లేందుకు ప్రయాణ ప్రాంగాణాలకు చేరుకోవడంతో అవి ప్రయాణికులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇచ్చిన నేపథ్యంలో చాలామంది తమ పిల్లలతో కలిసి సొంతూళ్లలో పండుగను జరుపుకునేందుకు బయలుదేరుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు సహా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారంతా కూడా సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఇలా వచ్చేవారితో ప్రయాణ ప్రాంగణాలు ప్రయాణికులతో నిండుగా కనిపిస్తున్నాయి. రద్దీ పెరుగడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అదనపు బస్సులను నడుపుతున్నారు. ఇటు హైదరాబాద్ నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం అదనపు బస్సులను నడిపిస్తుంది. ఇటు ఏపీ ప్రభుత్వం కూడా బస్సుల సంఖ్యను మరింతగా పెంచింది. సంక్రాంతి పండుగ తరువాత ప్రజలు తమ సొంతూళ్ల నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. అప్పుడు కూడా ఇదే మాదిరిగా రద్దీ ఉండనున్నది. ఈ నేపథ్యంలో ఇరు ప్రభుత్వాలు ప్రత్యేక బస్సులను అప్పటివరకు నడపనున్నాయి.
హైదరాబాద్ లోనూ ప్రయాణికుల రద్దీ..
ఇదిలా ఉంటే.. ఇటు హైదరాబాద్ లో స్థిరపడినవాళ్లు కూడా సంక్రాంతి పండుగ కోసం ఏపీలోని సొంతూళ్లకు బయలుదేరి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి.







