సామాన్యులకు చేరువవుతున్న పోస్టల్ డిపార్ట్‌మెంట్
గ్రామీణ ప్రాంతాల్లోకి విస్తరించిన పోస్టల్ సేవలు
అన్నీ సేవలకు కేంద్ర బిందువుగా పోస్టల్ సెంటర్స్
సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు
నెంబర్‌వన్‌గా నిలిచిన తెలంగాణ సర్కిల్
టిక్.. టిక్.. మంటూ.. వాట్సాప్‌ల్లో మెసేజ్‌లు, ఈ-మెయిల్స్ ను సెకన్స్ లో పంపించుకుంటున్నారు. దీంతో ఉత్తరాలు రాసేవారి సంఖ్య క్రమేణా తగ్గిపోయింది. ఇటు ఆన్‌లైన్ పేమెంట్స్ అందుబాటులోకి రావడంతో మనీఆర్డర్లు చేసేవారు కూడా కరువయ్యారు. ఈ నేపథ్యంలో తపాలాశాఖ కూడా కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రజలకు మరింతగా చేరువయ్యేందుకు పాత తరం సేవల్ని కొనసాగిస్తూనే, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మరింత వేగంగా సేవలు అందించేందుకు సిద్ధమైంది.
హైదరాబాద్, మహా: మానవుడు ప్రతిదానికీ టెక్నాలజీని జోడించి తన పనులను అత్యంత సులభతరం చేసుకుంటున్నాడు. దీంతో వారి పనులు చకచకాగా జరిగిపోయితున్నాయి. ఈ క్రమంలో నాటి నుంచి అమల్లో ఉన్న పలు సేవలకు ఆదరణ తగ్గింది. అటువంటివాటిల్లో ఒకటి తపాలా శాఖ సేవలు. నాటి రోజుల్లో టెక్నాలజీ ఇప్పుడున్నంతగా లేకపోవడంతో ప్రజలు సమాచారం షేరింగ్ కు సంబంధించి పోస్టల్ శాఖపైనే ఎక్కువగా ఆధారపడేవారు. డబ్బులు ఒకరికొరు పంపుకోవాలన్నా మనీ ఈ పోస్టల్ డిపార్టమెంట్ ద్వారానే మనీ ఆర్డర్ చేసుకునేవాళ్లు. దీంతో ఈ శాఖకు భారీగా గుర్తింపు ఉండేది. ఉత్తరాన్ని తీసుకువచ్చే పోస్ట్ మ్యాన్ కు ఎంతో ప్రిపరెన్స్ ఉండేది. సమాచారం.. అది మంచైనా, చెడైనా.. లేదా ఎవరికైనా ప్రభుత్వం ఉద్యోగం వచ్చినా మొదటగా చెప్పేది పోస్ట్ మ్యానే. ఇలా తపాల శాఖ ప్రజల జీవితాల్లో ఎక్కువగా మమేకమైపోయి ఉండేది. కానీ, ఇప్పుడు సాంకేతికత ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైనా సమాచారం షేర్ చేసుకోవాలంటే ఈమెయిల్స్ ద్వారా షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్ లో మెసేజ్ లను టకటక పెట్టేస్తున్నారు. దీంతో వారి సమాచారం సెకన్స్ లలో మరొకరికి చేరిపోతుంది. ఆ వెంటనే రిప్లై రావడం జరుగుతుంది. ఈ క్రమంలో ఉత్తరాలు రాసే వారి సంఖ్య రోజురోజుకు తగ్గుస్తూ వస్తుంది. దీంతో తపాల శాఖ నూతన ఒరవడికి అడుగులు వేస్తుంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రజలకు మరింతగా దగ్గరవుతుంది. దీంతో పోస్టల్ డిపార్ట్ మెంట్ కు పూర్వవైభవం వస్తుంది. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. పోస్టల్ సేవలు సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుత రోజుల్లో ఆధార్ ఎంత ఇంపార్టెంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిదానికి ఆధార్ కార్డును లింక్ చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో పిల్లలు పుట్టగానే మొదట చేయాల్సింది ఆధార్ నమోదు చేయాల్సి వస్తోంది. ఒకసారి ఆ నెంబర్ వచ్చాక, ఇక మన జీవితంలో ప్రతిఒక్కటీ దానితోనే ముడిపడి ఉంటుంది. అంతటి ప్రాధాన్యత ఉన్న ఆధార్‌తో ఈ పోస్టల్ శాఖ కలిసి పనిచేస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆధార్‌లో తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి నానా యాతన పడాల్సి వస్తుంది. ఒక్కసారి ఎడ్యుకేషన్ రికార్డుల్లో ఆ తప్పు దొర్లితే, ఇక జీవితాంతం దాన్ని అలాగే కొనసాగించుకోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే పోస్టల్ శాఖ ఆధార్‌తో అనుసంధానమై ప్రజలకు సేవలందించేందుకు ముందుకు వచ్చింది. ప్రజలు ఆధార్ సెంటర్లకు రావడం కాకుండా, తామే ప్రజల వద్దకు వెళ్లి సేవలు అందించాలని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు, అపార్ట్‌మెంట్లు, కాలనీల్లో ఆధార్ నమోదు, కరెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. దీంతో ప్రజలు, విద్యార్థులకు అనేక సమస్యలకు పరిష్కారం ఈ పోస్టల్ శాఖ ద్వారా లభించినట్టు అయ్యింది.
పోస్టల్ ఇన్స్యూరెన్స్‌కు ఫుల్ డిమాండ్
ఇటు పోస్టల్ ఇన్స్యూరెన్స్‌కు కూడా ప్రజల నుంచి భారీ ఆదరణ లభిస్తుంది. ఇప్పటివరకు న్స్యూరెన్స్ అంటే ఎల్ఐసీ లేదా ప్రయివేటు కంపెనీలే గుర్తుకొచ్చేవి. కానీ, ఇప్పుడు పోస్టల్ న్స్యూరెన్స్ మరింత మెరుగైన సేవల్ని అందించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకుంది. ఏజెంట్లుగా నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తుంది. దీంతో నిరుద్యోగ యువతకు ఉపాధి కూడా లభిస్తుంది. ఏటా పాలసీలపై బోనస్‌ను ప్రకటిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో నవంబర్ వరకు గ్రామ్ సురక్ష హోల్ లైఫ్ అష్యూరెన్స్ పాలసీలు 1,63,975 జారీ అయ్యాయి. గ్రామ్ సంతోష్ ఎండోమెంట్ అష్యూరెన్స్ పాలసీలు 14,94,549, గ్రామ్ సువిధ కన్వర్టబుల్ హోల్ లైఫ్ అష్యూరెన్స్ పాలసీలు 34,896 జారీ అయ్యాయి. ఇవి కాకుండా గ్రామీణ ప్రజల అవసరాలు, వారి ఆర్థిక స్థోమతను బట్టి చిన్న మొత్తాలతో పలు జీవిత బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇలా ప్రత్యేక పాలసీలను అమలు చేస్తూ ప్రజలకు మరింతగా చేరువవుతుంది.
ప్రత్యేక చొరవ తీసుకొని…
బాలికల కోసం ముందుచూపుతో ఆలోచించిన పోస్టల్ శాఖ వారి కోసం ప్రత్యేకంగా సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి తెలంగాణలో భారీ ఆదరణ లభిస్తుంది. ప్రత్యేకించి తెలంగాణ సర్కిల్ అధికారులు ప్రతి పోస్టాఫీసులోనూ లక్ష్యాలను నిర్దేశించి, దేశంలోనే ఎక్కువ మంది బాలికలకు ఈస్కీంను అందుబాటులోకి తెచ్చారు. కీసర వంటి పలు గ్రామీణ ప్రాంత పోస్టాఫీసుల్లో అక్కడి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు సుకన్య సమృద్ధి యోజన పథకం కోసం ప్రత్యేక ఖాతాలను తెరిపించారు. పోస్టల్ సిబ్బంది, ఆయా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల సంయుక్త కృషితో పేద కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా దాతల ద్వారా బాలికలకు ప్రీమియం కట్టిస్తున్నారు. పోస్టల్ సిబ్బంది నిత్యం ప్రజలతో మమేకం కావడం వల్లే ఇది సాధ్యమైంది.
పాస్‌పోర్టుల కోసం…
ఒకటి రెండు కాదు.. పోస్టాఫీసుల ద్వారా ప్రజలకు దాదాపు అన్ని సేవలు లభిస్తున్నాయి. పాస్‌పోర్టుల్ని కూడా పోస్టాఫీసుల ద్వారానే జారీ చేస్తున్నారు. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో విదేశాలకువెళ్లే వారి సంఖ్య పెరిగింది. దీంతో పాస్‌పోర్ట్ స్లాట్ల సంఖ్యను కూడా పెంచారు. పాస్‌పోర్టుల కోసం మారుమూల ప్రాంతాల ప్రజలు హైదరాబాద్‌కు రాకుండా, పోస్టాఫీసుల ద్వారానే దరఖాస్తుల స్వీకరణ, పోలీస్ వెరిఫికేషన్ సహా అన్ని సేవలను పక్కాగా అందిస్తున్నారు. దీంతో వారి పనులు చకచకా సాగిపోతున్నాయి.
ఆర్డీల్లోనూ రికార్డు..
పోస్టల్ రికరింగ్ డిపాజిట్లను (ఆర్డీ) సేకరించడంలో తెలంగాణ సర్కిల్ రికార్డును క్రియేట్ చేసింది. సాధారణ బ్యాంకులకంటే పాయింట్ 5 శాతం నుంచి 1 శాతం వరకు అధిక వడ్డీ రేట్లు పోస్టల్ ఆర్డీ ఖాతాల ద్వారా లభిస్తున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, పోస్టల్ సేవింగ్స్ ఖాతాలను నిర్వహిస్తున్నారు. ప్రజలు పోస్టాఫీసులకు వచ్చే అవసరం లేకుండానే పోస్టల్ సిబ్బందే గ్రామాలకు వెళ్లి, వారికి సేవలు అందిస్తున్నారు. దీంతో ప్రజల నుంచి ఆదరణ లభిస్తుంది.
యువతకు ఉపాధి..
గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ ఫ్రాంచైజ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు యువతకు అవకాశం కల్పిస్తున్నారు. దీంతో పోస్టాఫీసుల్లో లభించే సేవలన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. స్టాంపుల విక్రయం మొదలు కొరియర్, మనీఆర్డర్స్, సేవింగ్స్ ఖాతాలు, రికరింగ్ డిపాజిట్లు, కార్గో, ఇన్సూరెన్స్ సేవలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రజలకు లభిస్తున్నాయి. తెలంగాణ సర్కిల్ పరిధిలోని ఉన్న 6,208 పోస్టాఫీసులకు తోడు ఈ ఫ్రాంచైజీలు అదనంగా ప్రజలకు సేవలందిస్తున్నాయి.







