Mahaa Daily Exclusive

  దక్షిణ అయోధ్య భద్రాచలం మురిసి మెరిసింది…!

Share

అలల ఊయలపై సీతారాములు..

అపురూపం రాములోరి జలవిహారం

సీతారాముల జలవిహారం ముగ్ధ

మనోహరం…! వేద ఘోష పరిమళాలు…!

మిరిమిట్లు గొలిపే బాణసంచా వెలుగు జిలుగులు…!

అశేష భక్తజన సందోహం…!

జగదభి రామ జానకి రామా అంటూ భక్తుల జయ జయ ద్వానాలు…!

శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా గావించిన తెప్పోత్సవం

ఆబాల గోపాలాన్ని మైమరిపించింది…!

దక్షిణ అయోధ్య భద్రాచలం మురిసి మెరిసింది…!

భద్రాచలం, మహా

భద్రాచలం మహా పుణ్యక్షేత్రం. పుణ్య తీర్థం కూడా. ముక్కోటి వేడుక తరతరాలుగా సాంప్రదాయ బద్ధంగా ఇక్కడ వైభవంగా జరుపుతారు. ఈ ఏడాది శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయన మహోత్సవాల్లో భాగంగా గురువారం సాయంకాల సంధ్యా సమయాన భద్రాచల పవిత్ర పావన గౌతమి నదీ తీరంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి జలవిహారం వేడుక కనుల పండువుగా, కమనీయంగా, రమనీయంగా నిర్వహించారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల రామాలయంలో తొలుత వేద పండితులు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భాజభజంత్రీల సందడి నడుమ, పల్లకిపై శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని వేంచేయింపచేసి, భక్తుల జయ జయ ద్వానాలతో ఊరేగింపుగా పవిత్ర గౌతమీనది తీరానికి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హంస వాహనంపై లక్ష్మణ సమేతుడైన సీతారాములువారిని ఆసీనులను చేసి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి నదికి హారతులు ఇచ్చారు. వేద మంత్రాలను పఠించారు. విద్యుత్ కాంతులు మిరుముట్లు గొలుపుతుండగా, గోదారమ్మ పులకిస్తుండగా, శ్రీరామ జయరామ అంటూ భక్తులు నినదిస్తుండగా, వేదగోష పరిమళాలు వెదజల్లుతుండగా ఆ చూడాముచ్చటైన అపురూప జంట శ్రీ సీతారామచంద్ర స్వామి వారు జలవిహారం చేసిన తీరు భక్తులను తన్మయానికి గురిచేసింది. బాణాసంచా సందడి భక్తులను అలరించింది. పవిత్ర పావన గౌతమీ నదీ తీరంలో ఐదు సార్లు హంస వాహనంపై తిరుగుతూ వైకుంఠ రాముడు భక్తులకు సాక్షాత్కరించారు. మరోవైపు రకరకాల విద్యుత్ కాంతులతో బాణాసంచా కాల్చిన తీరు భక్తులను తన్మయానికి గురిచేసింది. గోదావరి ఇసుక తిన్నలపై కూర్చొని కనులారా ఈ వేడుక తిలకించిన భక్తజన హృదయాలు ఉప్పొంగాయి. శ్రీరామ..జయ రామ అంటూ భక్తులు చేసిన జయ జయ ద్వానాలు మిన్నంటాయి. గోదావరి తీరం అంతా జనసంద్రమైంది. గోదావరి తీరం వద్ద ప్రత్యేక ఆకర్షణగా ఈసారి అధికారులు తీసుకున్న చర్యలు భక్తులను ఆకర్షించాయి.
ఈ సంవత్సరం ఏరు (రివర్) ఫెస్టివల్ ఆదివాసి గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు మరియు గిరిజన వంటకాలు వారి కల్చర్ సంబంధించిన కార్యక్రమాలు గిరిజన విద్యార్థిని విద్యార్థులచే ఏర్పాట్లు చేసి భక్తులకు కనువిందు కలిగేలా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది.
భద్రాచలంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ స్వామివారి తెప్పోత్సవ వేడుకలో… తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ ఎండి విపి గౌతమ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ బి.రాహుల్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, భద్రాచలం రామాలయం ఈవో రమాదేవి, భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు, జిల్లా వివిధ శాఖల అధికారులు, రామాలయం వేద పండితులు, ఉద్యోగులు,అర్చక స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Latest