తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ తప్పులకు మేం తిట్లు తింటున్నామంటూ ఆయన సీరియస్ అయ్యారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘తిరుపతి తొక్కిసలాట ఘటన విషయమై రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాను క్షమాపణలు చెబుతున్నాం. ఈ ఘటన జరగకుండా ఉండాల్సింది. రద్దీని సరిగా మేనేజ్ మెంట్ చేయలేని కారణంగానే ఈ ఘటన జరిగిందంటూ భక్తులు పేర్కొంటున్నారు. అధికారులు, పోలీసులు ఉండి కూడా భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. తిరుమలలో వీఐపీలపై కాదు సామాన్య భక్తులపై టీటీడీ దృష్టిసారించాలి. ఇక మీద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనకు టీటీడీ ఈఓ, ఏఈఓనే బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా ఘటనా స్థలిలో ఉన్నటువంటి పోలీసులు కూడా బాధ్యత తీసుకోవాలి. మృతుల కుటుంబ సభ్యుల వద్దకు టీటీడీ సభ్యులు వెళ్లి క్షమాపణలు కోరాలి. అధికారులు చేసిన తప్పులకు ప్రభుత్వం తిట్లు తినాల్సి వస్తోంది. తొక్కిసలాట లేదా ఇతర అనుకోని సంఘటనలు జరిగితే సహాయక చర్యలు ఎలా ఉండాలనేదానిపై ఓ ప్రణాళిక లేదు. భవిష్యత్ లో ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈఓ, ఏఈఓ, పాలకమండలి మధ్య గ్యాప్ ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. అదేవిధంగా పోలీసుల్లో కొందరు కావాలని చేశారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిపైనా విచారణ జరగాల్సి ఉంది. ఇకమీదట తిరుమలలో శ్రీవారి దర్శనం 8 గంటల్లో కాకుండా రెండుమూడు గంటల్లోనే జరిగేలా చూస్తాం’ అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.







