Mahaa Daily Exclusive

  4 ప్రశ్నలను 40 రకాలుగా అడిగారు – ఏసీబీ విచారణపై కేటీఆర్​

Share

4 ప్రశ్నలను 40 రకాలుగా అడిగారు

– ఏసీబీ విచారణపై కేటీఆర్​

.. ఆరున్నర గంటలపాటు విచారణ

– రేవంత్ చెప్పిన ప్రశ్నలనే అడిగారు
– ఎపుడు పిలిచినా విచారణకు వస్తానని వెల్లడి

సుప్రీంలో కేటీఆర్‌కు దక్కని ఊరట- 15న విచారణ

హైదరాబాద్, మహా

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమారుడు, మాజీమంత్రి కేటీఆర్‌పై ఏసీబీ విచారణ గురువారం జరిగింది. గత కొన్ని వారాలుగా జరుగుతున్న కీలక పరిణామాల నడుమ కేటీఆర్ గురువారం ఏసీబీ ఎదుట హాజరయ్యారు. ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఏసీబీ విచారణ ముగిసింది. సుమారు ఆరున్నర గంటల పాటు కేటీఆర్​ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఏసీబీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని కేటీఆర్ మీడియాకు తెలిపారు. అధికారులకు అన్ని విధాలా సహకరించానని, విచారణకు ఎన్ని సార్లు పిలిచినా, హాజరవుతానని తెలిపారు. ఇదొక చెత్త కేసు అని దర్యాప్తు అధికారులకు తెలిపినట్లు కేటీఆర్ చెప్పారు.

ఎప్పుడు పిలిచినా రెడీ- కేటీఆర్

విచారణకు ఎప్పుడు పిలిచినా కూడా రావాలని ఏసీబీ తెలుపగా, కేటీఆర్ వస్తానని చెప్పారు. అయితే నాలుగు రకాల ప్రశ్నలనే 40 విధాలుగా అడిగారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను చెప్పాల్సినది చెప్పినట్లు తెలిపారు కేటీఆర్. అంతేకాదు ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, రేవంత్ చెప్పిన ప్రశ్నలనే అధికారులు అడిగారని కేటీఆర్ అన్నారు. మరోవైపు కేటీఆర్ విచారణ నేపథ్యంలో అరెస్ట్ అవుతారా అని బీఆర్ఎస్ వర్గాలు భయాందోళన చెందాయి. విచారణ సమయంలో కేటీఆర్ వెంట న్యాయవాది రామచంద్రరావు కూడా ఉన్నారు. కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్ కేటీఆర్‌ను విచారించారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ విచారణను పర్యవేక్షించారు. ఈ విచారణను వేరే గది కేటీఆర్ న్యాయవాది రామచంద్రరావు చూసేలా ఏర్పాట్లు చేశారు.

రూ. 55 కోట్ల చుట్టూ..

కేటీఆర్‌కు ఈ కేసులో అనేక ఆరోపణలు వచ్చాయి, అవి నిరూపించడానికి ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. గత కొన్ని రోజులుగా ఈ కేసు చుట్టూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పూర్తి విచారణ కోసం కేటీఆర్ ఈరోజు ఉదయం ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఆయన వెంట న్యాయవాది రామచంద్రరావు కూడా హాజరయ్యారు. కేటీఆర్‌ను ముగ్గురు ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అరవింద్ కుమార్, దానకిషోర్ ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా ఈ విచారణ జరగింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ప్రాజెక్టులో నియమాలను ఉల్లంఘించి రూ.55 కోట్లు ఎఫ్‌ఈవోకు బదిలీ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై ఏసీబీ కేటీఆర్‌ను విచారించింది. అయితే కేటీఆర్ విచారణ సందర్భంగా న్యాయవాదికి అనుమతి ఇవ్వాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఈ ఆదేశం ప్రకారం కేటీఆర్ విచారణను అనుసరించి, న్యాయవాది లైబ్రరీలో కూర్చోవడం ద్వారా ఏసీబీ చర్యలు తీసుకుంది. కేటీఆర్-న్యాయవాది సంభాషణలకు విజిబుల్ డిస్టెన్స్‌లో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ విచారణ తర్వాత కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసేందుకు ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను ఆఫీస్‌లో విచారించారు. ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొనడం, స్టేట్‌మెంట్ రికార్డు చేయడం తదితర చర్యలు తీసుకున్నాయి. దీంతో ఈ కేసు విషయంలో తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయేనని రాజకీయ వర్గాలతోపాటు అనేక మంది ఆసక్తితో ఉన్నారు.
……………………..

కేటీఆర్ ను అడిగిన ప్రశ్నలు ఇవే
..
ప్రశ్నలు ఇవే..

రూ. 55 కోట్లు విదేశీ కంపెనీకి ఎందుకు చెల్లించారు?

ఇది నిబంధనలకు విరుద్దమని మీకు తెలియదా?

ఆర్బీఐ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు?

కేబినెట్ ఆమోదం లేకుండానే నిధులు మళ్లింపా?

ఆర్థిక శాఖ పర్మిషన్ అవసరం లేదనుకున్నారా?

అగ్రిమెంట్లు, చెల్లింపులన్నీ మీ ఆధ్వర్యంలోనే జరిగాయా?

కేటీఆర్ ఆదేశాల మేరకే నగదు రిలీజ్ చేశామన్న అధికారులు చెపుతున్నారు మీ సమాధానం ఏంటి ?

అసలు హైదరాబాద్‌లో ఫార్ములా రేస్ ప్రతిపాదన ఎవరిది ? ఈ ప్రతిపాదనను ఎవరు ఆమోదించారు ?

హైదరాబాద్‌లోనే ఈ ఫార్ములా రేస్‌ను ఎందుకు నిర్వహించాలనుకున్నారు ?

రేస్ నిర్వహించడం వలన ప్రభుత్వానికి ఏమైనా ప్రయోజనం లభించిందా?

ఎఫ్‌ఈవో కంపనీకే ఎందుకు ఈ రేస్ నిర్వహణ బాధ్యతలు ఇచ్చారు?

కేటీఆర్ , మీకు అధికారులు నగదు బదిలీ చేస్తే ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారా ?

నగదు బదిలీ అనే అంశం నిబంధనలకు విరుద్ధం అనేది మీ అధికారులు మీ దృష్టికి తీసుకొచ్చారా ?

నిబంధనలు విరుద్దంగా నగదు బదిలీ చేస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని అధికారులు మీకు చెప్పారా ? హెచ్చరించారా ?

నిబంధనలు పట్టుంచుకోకుండా 55 కోట్లు నగదు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది ?

నగదు బదిలీ చేసే సమయంలో రూల్స్ బ్రేక్ చేయమని మీరే చెప్పారా ?

అరవింద్ కుమార్ మాత్రం మీ ఆదేశాలతో నగదు బదిలీ చేశామని వాంగ్మూలం ఇచ్చారు. దీనికి మీ సమాధానం ఏంటి ?

గ్రీన్ కో కంపనీ స్పాన్సర్ షిప్ నుంచి వైదొలిగింది ?

స్పాన్సర్ షిప్‌లో ఉన్న కంపనీ మీకు ఎలక్ట్రోల్ బాండ్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ?

ఈ స్పాన్సర్ షిప్ ద్వారా ఆ కంపినీకి ప్రయోజనం చేకూరిందా ?

మీపై మోపిన అభియోగాలు పై మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు ?

నగదు బదిలీ అంశం కేబినెట్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు ? కేబినెట్ నుంచి అనుమతులు లేకుండా ఎలా బదిలీ చేస్తారు ?

బదిలీ అయిన నగదు తిరిగి హెచ్‌ఎండీఏ ఖాతాకు వచ్చిందా లేదా ? మీకు సమాచారం ఏమైనా ఉందా ? అంటూ వరుసగా ఏసీబీ ప్రశ్నలు సంధించింది.

ఈడీ విచారణకు హాజరైన అరవింద్‌

మరోవైపు ఫార్ములా ఈ కేసులో అటు ఏసీబీ.. ఇటు ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఓ వైపు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తుండగా.. ఈ కేసులో ఏ2 గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ఈడీ అధికారులు విచారించారు. ఈడీ విచారణకు అరవింద్ కుమార్ హాజరయ్యారు. నిన్న ఏసీబీ విచారణను అరవింద్ కుమార్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దాదాపు ఆరు గంటల పాటు ఐఏఎస్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఆయన నుంచి పలు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అరవింద్ కుమార్, దాన కిషోర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. తానే డబ్బులు ఇవ్వమని ఆదేశించానని, ఇచ్చిన డబ్బులు అక్కడ ఉన్నాయని.. ఇందులో అవినీతి ఎక్కడుందని కేటీఆర్ ఎసిబి ముందు వాదించారు.

సుప్రీంలో దక్కని ఊరట.. 15న విచారణ

హైదరాబాద్ : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌‌ను రేపు (శుక్రవారం) విచారణకు తీసుకునేందుకు చీఫ్ జస్టిస్ నిరాకరించారు. ఈనెల 15న సుప్రీంలో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. 15వ తేదీన విచారణకు లిస్ట్ చేసినందున అదే రోజు విచారిస్తామని సీజే స్పష్టం చేశారు. అప్పటి దాకా కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

Latest