తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతిచెందడం బాధాకరమని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా(ఎక్స్)లో పోస్ట్ పెట్టారు. గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట ఘోరమైన మృత్యుఘోష ఆర్తనాదాలు వినిపించాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడం పాలన యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై వెంటనే అత్యున్నత విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నైతిక బాధ్యత వహించాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం కాదు.. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. వారి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు.





