తిరుపతి ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం వల్లే తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తిరుపతిలో ఘోర ప్రమాదం జరిగింది. తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోవడం అత్యంత బాధాకరం. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. తిరుమల కొండపై వివాదాలు సృష్టించి, రాజకీయంగా వైసీపీని అణచివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భక్తులకు సేవ చేయాలనే దృక్ఫథం వారికి లేదు. వైకుంఠ ఏకాదరి ఏర్పాట్లపై కిందిస్తాయి సిబ్బంది సూచనలు ఎందుకు తీసుకోలేదు. కేవలం అధికారుల తప్పిదం, మానవ లోపంతోనే ఈ తొక్కిసలాట జరిగింది. చైర్మన్ బీఆర్ నాయుడికి దేవుడి మీద భక్తి లేదు. ఆయన కేవలం వైసీపీ పై విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్నారు. కొండ మీద రాజకీయాలు చేసి జగన్‌ను అడ్డుకునే ప్రయత్నాలే చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడిగా చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్ ఈ ఘటనపై ఏం సమాధానం చెప్తారు?’ అంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.






