ఏసీబీ లాగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 7 గంటల పాటు కొనసాగిన ఈడీ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారని, విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని ఈడీకి చెప్పినట్లు కేటీఆర్ తెలిపారు. తాను ఏ తప్పు చేయకున్నా చట్టాలను గౌరవించే పౌరుడిగా విచారణకు వచ్చానని, ఒక్క రూపాయి అవినీతి చేయలేదని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డిపై ఈడీ కేసు ఉందని, అందుకే తనపై కూడా కేసు పెట్టించారని కేటీఆర్ ఆరోపించారు. జడ్జి ముందు ప్రత్యక్ష విచారణకు సిద్ధమని, దమ్ముంటే సీఎం రేవంత్‌రెడ్డి రావాలని సవాల్ విసిరారు.
ఎనీ టైమ్, ఎనీ సెంటర్.. నేను రెడీ..
మీకు ధైర్యముంటే వెంటనే నిర్ణయం తీసుకోండి. డేట్ మీరే చెప్పండి, టైమ్ మీరే చెప్పండి, ప్లేస్ మీరే చెప్పండి. నిజాయితీగా నా చెయ్యి ఇస్తా. లై డిటెక్టర్ టెస్ట్ కి మీరు కూడా కూర్చోండి. ఈడీ విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా. ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెబుతా. ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే అంతిమంగా న్యాయం, ధర్మం, నిజం, నిజాయితీ గెలుస్తాయి. కోర్టులు, న్యాయమూర్తులపై మాకు విశ్వాసం ఉంది” అని కేటీఆర్ అన్నారు.
ముందుకు రా.. ఎవరి నిజాయితీ ఏంటో రాష్ట్రం మొత్తం చూస్తుంది
”ప్రజాధనం దుర్వినియోగం అయ్యేలా, ఇంతమంది ఉన్నతాధికారుల సమయం వృథా అయ్యేలా, ఇన్ని మీడియా సంస్థల టైమ్ వేస్ట్ అయ్యే విధంగా కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. నేను రెడీగా ఉన్నా. ధైర్యముంటే ముందుకు రా. జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే, ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, ఈడీ ఆఫీస్ లో అయినా సరే.. నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. మీరు కూడా రండి. ఇద్దరం కూర్చుందాం. దొంగ ఎవరో తెలిసిపోతుంది. ఎవరి నిజాయితీ ఏంటో రాష్ట్రం మొత్తం చూస్తుంది అని విచారణ అనంతరం కేటీఆర్ అన్నారు.
ఉదయం నుండి ఉద్రిక్తత
మరోవైపు కేటీఆర్ విచారణకు హాజరైన నేపథ్యంలో ఉదయం నుండి అరెస్ట్ ప్రచారంతో ఉత్కంఠ నెలకొంది. ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. కొందరు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ కార్యాలయం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే గోపినాథ్, బాల్కసుమన్, ఆర్.ఎస్.ప్రవీణ్‌లను వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈడీ ఆఫీసు వైపు వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. ఉదయం 10.40 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5.45 గంటలకు ముగిసింది. ఇప్పటికే ఈడి రెండుసార్లు అరవింద్ కుమార్ ను విచారించగా, గురువారం మొబైల్ చాట్ ఆధారంగా పలు ప్రశ్నలు అడిగినట్లు చెబుతున్నారు. ఉదయం కేటీఆర్ తో ఒక్కసారిగా నేతలు, కార్యకర్తలు రాగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలించారు. సాయంత్రం కూడా భారీగా నేతలు తరలివచ్చారు. కేటీఆర్ ఇప్పటికే ఒకసారి ఎసిబి, మరోసారి ఈడి విచారణలకు హాజరయ్యారు. కేటీఆర్ వెంట గంగుల కమలాకర్ తో పాటు ముఖ్యనేతలు సమావేశంలో పాల్గొన్నారు. కాగా ఏమైనా అవకతకలు ఉన్నట్లు సందేహాలుంటే అధికారులను అడిగి తెలుసుకోవాలంటూ విచారణలో కేటీఆర్ ట్విస్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘన ఏదైనా ఉన్నట్లయితే అది అధికారులే చూసుకోవాలని, మంత్రిగా తనకు ఏంటి సంబంధం అని విచారణలో ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈడి ఈ వ్యవహారంలో ఎలా ముందుకెళ్తుందో చూడాలి








